Share News

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్

ABN , Publish Date - Jul 21 , 2026 | 09:08 PM

దేశవాళీ క్రికెట్‌లో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఆట నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేస్తే మ్యాచ్ నుంచే సస్పెన్షన్
BCCI New Rules

ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్‌లో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఆట నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్‌ఫుట్ నో బాల్ లేదా పిచ్‌పై పడకుండా బంతి వేస్తే (నాన్-ల్యాండింగ్ డెలివరీ) ఆ బౌలర్‌ను మిగిలిన మ్యాచ్ మొత్తం నుంచి సస్పెండ్ చేయనున్నట్లు ప్రకటించింది.


ఇప్పటి వరకు ఇలాంటి బంతులు వేసిన బౌలర్‌ను కేవలం ఆ ఇన్నింగ్స్‌కు మాత్రమే బౌలింగ్ చేయకుండా నిలిపివేసేవారు. ఇకపై మాత్రం మ్యాచ్ మొత్తానికే బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. అయితే ఈ నిర్ణయాన్ని మైదానంలోని అంపైర్లే పరిస్థితులను బట్టి తీసుకుంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇటీవల ప్రతిపాదించిన మార్పులను బీసీసీఐ ఆమోదించి, అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సర్క్యులర్ పంపింది. వచ్చే నెల దులీప్ ట్రోఫీతో దేశవాళీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర సంఘాలు ఇప్పటికే అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు కొత్త నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.


దేశవాళీ క్రికెట్‌లో కొత్త నిబంధనలు..

  • టెస్టు క్రికెట్‌లో ఆట ముగింపుపై కూడా బీసీసీఐ మరో కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై చివరి ఓవర్‌లో వికెట్ పడినా.. ఆ ఓవర్ పూర్తయ్యే వరకు ఆట కొనసాగుతుంది. ప్రస్తుతం చివరి ఓవర్ మధ్యలో వికెట్ పడితే వెంటనే స్టంప్స్ ప్రకటించే అవకాశం ఉండేది. ఈ నిబంధన వల్ల కొత్త బ్యాటర్‌కు రోజు చివర్లో క్రీజులోకి వచ్చే అవకాశం లేకుండా పోతుందని భావించిన ఎంసీసీ.. దీనిలో మార్పు సూచించింది. బీసీసీఐ కూడా అదే అమలు చేయనుంది.

  • ఇక నుంచి మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో జట్లు డిక్లరేషన్ ప్రకటించడం.. లేదా ఇన్నింగ్స్‌ను ఫోర్ఫీట్ చేయడం అనుమతించరు. ఈ నిబంధనను కొన్ని జట్లు కృత్రిమ ఫలితాల కోసం ఉపయోగిస్తున్నాయని, అది ఆట స్ఫూర్తికి విరుద్ధమని బీసీసీఐ అభిప్రాయపడింది.

  • దేశవాళీ వన్డే మ్యాచ్‌ల్లో ఇకపై డ్రింక్స్ బ్రేక్ సమయంలో జట్టు హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా ఇలాంటి నిబంధన తీసుకురావాలని ఐసీసీ ప్రతిపాదించింది.

  • వికెట్‌ కీపర్లకు కూడా కొత్త నిబంధనతో ఊరట లభించింది. బౌలర్ బంతి విసిరే క్షణంలో మాత్రమే కీపర్ గ్లౌజులు వికెట్ల వెనుక ఉండాలి. ఇప్పటి వరకు బౌలర్ రన్‌అప్ ప్రారంభించినప్పటి నుంచే గ్లౌజులు వికెట్ల వెనుక ఉండాల్సి వచ్చేది.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా

రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: రవి శాస్త్రి

Updated Date - Jul 21 , 2026 | 09:09 PM