యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీస్‌కు రౌనక్
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:14 PM
యూఎస్ ఓపెన్300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ రౌనక్ చౌహాన్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో అతడు సెమీస్‌కు చేరుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: యూఎస్ ఓపెన్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొట్టేస్తున్నారు. పురుషులు, మహిళల విభాగంలో ముగ్గురు ప్లేయర్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో దేవికా సిహాగ్ విజయం సాధించగా.. పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాంత్, రౌనక్ చౌహాన్ సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల యువ షట్లర్ రౌనక్ చౌహాన్ ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్, 6వ ర్యాంకర్ అయిన టియెన్ చెన్‌ను వరుస గేమ్‌లలో 21-17, 26-24 తేడాతో ఓడించి రౌనక్.. క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. క్వార్టర్స్‌లోనూ కేవలం 38 నిమిషాల్లోనే ఇజ్రాయెల్ టాప్ ప్లేయర్ మిషా జిల్బెర్‌మన్‌ను చిత్తు చేశాడు. 23-21, 21-11 తేడాతో విజయం సాధించాడు. దీంతో తొలిసారి మెగా టోర్నీ సెమీస్‌లో అడుగు పెట్టాడు.
మరో సింగిల్స్‌లో సీనియర్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ 21-9, 12-21, 21-8 తేడాతో చైనీస్ తైపీ ప్లేయర్ లియావో జౌఫును ఓడించాడు. ఇవాళ జరగనున్న సెమీస్‌లో జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ యుదై ఒకిమోటోతో శ్రీకాంత్ తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో దేవిక మరోసారి నిలకడైన ప్రదర్శనతో జపాన్ ప్లేయర్ రికో గుంజిని 22-20, 21-19 తేడాతో ఓడించింది. రెండు గేమ్‌ల చివరి దశల్లోనూ సంయమనం కోల్పోకుండా ఆడిన దేవిక..డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ క్రిస్టోఫర్సన్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది.
ఇవి కూడా చదవండి:
ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె
అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు.. ఎందుకంటే!