సుప్రీం కోర్టు తీర్పు.. దశాబ్దాల నాటి ఆస్తి తగాదాకు ఫుల్ స్టాప్
ABN , Publish Date - Jun 27 , 2026 | 03:37 PM
నాలుగు తరాలుగా కొనసాగుతున్న ఒక ఆస్తి ఆస్తి వివాదానికి సుప్రీం కోర్టు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. 1957 నాటి సేల్ డీడ్ చెల్లుతుందని సుప్రీం తీర్పు వెలువరించడంతో వివాదానికి ముగింపు పడింది.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు తరాలుగా కొనసాగుతున్న ఒక భూవివాదానికి సుప్రీం కోర్టు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. భూమికి సంబంధించిన 1957 నాటి సేల్ డీడ్ చట్టబద్ధమేనంటూ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిన్ ఎన్.వి అంజరియాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.
ఏమిటీ వివాదం..
ఈ కేసులో అప్పీలు చేసుకున్న సరాఫత్ అలీ పూర్వీకులు 1957లో హరిద్వార్ (ఉత్తరాఖండ్) కొంత భూమిని కొనుగోలు చేశారు. అప్పటికి సరాఫత్ అలీ మైనర్. నాటి నుంచీ ఆ భూమి సరాఫత్ అలీ కుటుంబం ఆధీనంలోనే ఉంది. భూమిని సరాఫత్ పూర్వీకులకు అమ్మిన కొందరు అభ్యంతరం చెప్పడంతో సేల్ డీడ్ జరిగినా మ్యూటేషన్ మాత్రం నిలిచిపోయింది. 1984లో వారు తమ అభ్యంతరాలను వెనక్కు తీసుకోవడంతో మ్యూటేషన్ కూడా పూర్తయ్యింది. అయితే, 1991లో ప్రభుత్వం భూమి ఏకీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో తనను భూమిదారుగా గుర్తించాలని సరాఫత్ దరఖాస్తు చేసుకున్నారు.
1993లో కన్సాలిడేషన్ అధికారి సరాఫత్ హక్కులను గుర్తించారు. అయితే, సరాఫత్ భూమిపై కో టెన్యూర్ హక్కులున్న మరికొందరు అభ్యంతరం లేవనెత్తారు. దీంతో 1999లో కన్సాలిడేషన్ అధికారి సరాఫత్ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు. యూపీ జమీందారీ భూములు రద్దు చట్టం ప్రకారం 1957 నాటి సేల్ డీడ్ చెల్లదన్నారు. అంతేకాకుండా నాటి సేల్ డీడ్‌పై సంతకం చేసిన సాక్షి వివరాల్లో స్పష్టత లేకపోవడంతో సరాఫత్ కుటుంబానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. చివరకు హైకోర్టులో కూడా సరాఫత్ కుటుంబానికి చుక్కెదురైంది.
ఈ కేసులో సుప్రీం కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. సాక్షి వివరాల్లోని స్వల్ప లోపాల ఆధారంగా సేల్ డీల్ చెల్లదని చెప్పలేమని పేర్కొంది. సేల్ డీడ్ ఫోర్జరీ జరిగిందనే ఫిర్యాదు కూడా లేకపోవడాన్ని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. జమీందారీ చట్టానికి 1981లో చేసిన సవరణలు 1957కు వర్తించవని కూడా పేర్కొంది. నాటి సేల్ డీడ్ చెల్లుతుందంటూ తీర్పు వెలువరించింది.
ఈ వార్తలనూ చదవండి:
తలపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. హెల్మెట్ పెట్టుకోకపోవటంతో..
పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా