Share News

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్ లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా

ABN , Publish Date - Jun 27 , 2026 | 02:02 PM

మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. దీంతో రేపటి పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.

పరీక్షకు ఒక రోజు ముందే క్వశ్చన్ పేపర్  లీక్.. మహారాష్ట్ర టెట్ వాయిదా
PM Modi to Meet Jonathan, World's Oldest Living Land Animal, During Seychelles Visit

థానే(మహారాష్ట్ర), జూన్ 27: దేశంలో పరీక్ష పేపర్ల లీకేజీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష'(TET) పేపర్.. పరీక్షకు 24 గంటల ముందే లీక్ కావడం కలకలం రేపింది. ఆదివారం (జూన్ 28) జరగాల్సిన ఈ పరీక్షను పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర పరీక్షల మండలి (MSEC) ఇవాళ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, నమ్మకత్వాన్ని కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మండలి స్పష్టం చేసింది.


అర్ధరాత్రి దాడులు – గుట్టురట్టు!

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. థానే రీజియన్‌ పరిధిలో టెట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు శనివారం తెల్లవారుజామున పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన భివండీ పోలీసులు ఒక రహస్య స్థావరంపై దాడి చేశారు. అక్కడ కొందరు వ్యక్తులు సీల్డ్ టెట్ క్వశ్చన్ పేపర్ ప్యాకెట్‌కు సంబంధించిన పేజీలను కలిగి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే పరీక్షల మండలి అధికారులను పిలిపించి ఆ పేజీలను అసలు ప్రశ్నపత్రంతో సరిపోల్చి చూశారు. అవి లీక్ అయిన ఒరిజినల్ పేపరేనని తేలడంతో భివండీ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


4.28 లక్షల మంది అభ్యర్థుల భవితవ్యం

రాష్ట్రవ్యాప్తంగా 1,028 కేంద్రాలలో రేపు (ఆదివారం) జరగాల్సిన ఈ పరీక్ష కోసం సుమారు 4.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని, కేంద్రాలకు బయలుదేరే సమయానికి పేపర్ లీక్ కారణంగా పరీక్ష వాయిదా పడడంతో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర నిరాశకు, ఆందోళనకు గురవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

భూకంపం వస్తోంది జాగ్రత్త

Updated Date - Jun 27 , 2026 | 02:28 PM