బీడబ్ల్యూసీ కౌన్సిల్లో పీవీ సింధుకు కీలక పదవి
ABN , Publish Date - Apr 28 , 2026 | 08:35 AM
ప్రముఖ భారత బ్యాడ్మింటన్.. రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు క్రీడా పాలనారంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కౌన్సిల్ సభ్యురాలిగా సింధు ఎన్నికయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: ప్రముఖ భారత బ్యాడ్మింటన్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె ఇప్పుడు బీడబ్య్లూఎఫ్ కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. దీంతో సింధు బ్యాడ్మింటన్ కోర్టులో చురుకైన క్రీడాకారిణిగా ఉంటూనే.. ప్రపంచ స్థాయి నిర్ణయాధికార కమిటీలో ఓటు హక్కు కలిగిన సభ్యురాలిగాఎంపికవడం విశేషం.
ఇటీవలే డెన్మార్క్‌లోని హార్సెన్స్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మొదటిసారి కౌన్సిల్ సభ్యురాలిగా హాజరయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో సింధు చేరడం వల్ల క్రీడాకారుల సమస్యలకు ప్రాధాన్యం లభించనుంది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో ప్రైజ్ మనీ కేటాయించడం, అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఉన్న టోర్నమెంట్ల ఒత్తిడిని తగ్గించడం వంటి సంస్కరణల కోసం ఆమె కృషి చేసే అవకాశం ఉంది. నిరంతర టోర్నమెంట్ల వల్ల ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్న తరుణంలో, సింధు ప్రాతినిధ్యం క్రీడాకారుల ప్రయోజనాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తారు.
ఈ బాధ్యతపై సింధు స్పందిస్తూ.. బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల గళాన్ని బీడబ్ల్యూఎఫ్‌లో వినిపిస్తానని, బ్యాడ్మింటన్ తనకు ఎంతో ఇచ్చిందని వెల్లడించారు. ఈ క్రీడకు తన వంతు సహకారం అందించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని సింధు తెలిపారు. బ్యాడ్మింటన్ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో సింధు అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని బోర్డు సభ్యులు విశ్వసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ ఢిల్లీ బ్యాటర్ అరుదైన రికార్డు