Share News

ఢిల్లీ ఢమాల్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 03:03 AM

టీ20 ఫార్మాట్‌ ఎంత విచిత్రమైందో ఈ మ్యాచ్‌ చూస్తే అర్థమవుతుంది. శనివారం 264 పరుగులతో వహ్వా.. అనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ సోమవారం అదే అరుణ్‌జైట్లీ మైదానంలో బేలగా మారింది....

ఢిల్లీ ఢమాల్‌

నేటి మ్యాచ్‌

పంజాబ్‌ X రాజస్థాన్‌

వేదిక చండీగఢ్‌, రా.7.30 నుంచి

సొంతగడ్డపై 75 రన్స్‌కే ఆలౌట్‌

నిప్పులు చెరిగిన హాజెల్‌వుడ్‌, భువనేశ్వర్‌

9 వికెట్లతో బెంగళూరు ఘనవిజయం

పరుగుల వరద పారుతూ బ్యాటర్ల స్వర్గధామంలా మారిన ఈ ఐపీఎల్‌కు కాస్త బ్రేక్‌నిస్తూ ఈసారి బౌలర్లు పండగ చేసుకున్నారు. బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ బౌలర్లు రెచ్చిపోయారు. పరుగులు ఇవ్వక, వెంటవెంటనే వికెట్లు పడగొడుతూ ఢిల్లీ సొంతగడ్డపై ఆ జట్టు బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చారు. ఇక, లక్ష్యం చిన్నది కావడంతో బెంగళూరు బ్యాటర్లు 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

న్యూఢిల్లీ: టీ20 ఫార్మాట్‌ ఎంత విచిత్రమైందో ఈ మ్యాచ్‌ చూస్తే అర్థమవుతుంది. శనివారం 264 పరుగులతో వహ్వా.. అనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ సోమవారం అదే అరుణ్‌జైట్లీ మైదానంలో బేలగా మారింది. జట్టు మొత్తం కలిపి కూడా కనీసం 80 పరుగులైనా చేయలేకపోవడం గమనార్హం. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పేసర్లు హాజెల్‌వుడ్‌ (4/12), భువనేశ్వర్‌ (3/5) సంచలనాత్మక బౌలింగ్‌తో ప్రత్యర్థి వెన్నువిరిచారు. దీంతో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 16.3 ఓవర్లలో 75 పరుగులకు కుప్పకూలింది. అభిషేక్‌ పోరెల్‌ (30), డేవిడ్‌ మిల్లర్‌ (19), జేమిసన్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో బెంగళూరు 6.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసి గెలిచింది. దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34 నాటౌట్‌), విరాట్‌ కోహ్లీ (15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23 నాటౌట్‌) రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా హాజెల్‌వుడ్‌ నిలిచాడు.

6.3 ఓవర్లలోనే..: 76 పరుగుల స్వల్ప ఛేదనను ఆర్‌సీబీ పవర్‌ప్లేలోనే దాదాపుగా ఛేదించింది. దేవ్‌దత్‌ తన సహజశైలిలో చెలరేగాడు. అంతకుముందు ఓపెనర్‌ బెథెల్‌ (11 బంతుల్లో ఓ ఫోర్‌, 2 సిక్సర్లతో 20) వికెట్‌ మూడో ఓవర్‌లో కోల్పోయినా.. దేవ్‌దత్‌ వచ్చీ రాగానే ఎదురుదాడికి దిగాడు. నాలుగో ఓవర్‌లో 6,4 బాదిన అతను జేమిసన్‌ ఓవర్‌లో 6,4,4,6తో 21 రన్స్‌ అందించాడు. ఈ ధాటికి పవర్‌ప్లేలో జట్టు 65/1తో నిలిచింది. ఆ తర్వాత ఓవర్‌లో 2 సిక్సర్లు బాదిన విరాట్‌ 81 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


9-Sports.jpg

పేకమేడను తలపిస్తూ..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్‌సీబీ పేసర్లు భువనేశ్వర్‌, హాజెల్‌వుడ్‌ కొత్త బంతితో అల్లాడించారు. వీళ్లిద్దరి పదునైన బౌలింగ్‌కు ఢిల్లీ జట్టు పరుగులకన్నా వేగంగా వికెట్లు కోల్పోయే పరిస్థితి కనిపించింది. ఇద్దరూ పోటాపోటీగా వికెట్లు పంచుకోవడంతో కేవలం 8 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ దిక్కుతోచని స్థితిలో నిలిచింది. తొలి ఓవర్‌లోనే అరంగేట్ర ఓపెనర్‌ సాహిల్‌ (0)ను భువీ బౌల్డ్‌ చేయగా.. గతమ్యాచ్‌లో భారీ సెంచరీ బాదిన రాహుల్‌ (1), రిజ్వీ (0)లను రెండో ఓవర్‌లో వరుస బంతుల్లో హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేశాడు. ఇక మూడో ఓవర్‌లో స్టబ్స్‌ (5), కెప్టెన్‌ అక్షర్‌ (0)లను భువీ దెబ్బతీయడంతో ఢిల్లీ శిబిరం అయోమయంలో పడింది. ఈ దశలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అభిషేక్‌ పోరెల్‌ పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. అతడికి మిల్లర్‌ సహకరించడంతో ఐదు ఓవర్లపాటు వికెట్‌ పడకుండా ఇన్నింగ్స్‌ సాగింది. వీరి మధ్య ఏడో వికెట్‌కు 35 రన్స్‌ చేరాయి. మిల్లర్‌ నిష్క్రమించాక ఉన్న కాసేపు జేమిసన్‌ భారీషాట్లతో చెలరేగాడు. దీంతో 11వ ఓవర్‌లో స్కోరు 50 దాటింది. స్పిన్నర్లు క్రునాల్‌, సుయాశ్‌ కట్టడి చేయడంతో జేమిసన్‌, కుల్దీప్‌ (3) వెనుదిరిగారు. ఇక హాజెల్‌వుడ్‌ మరోసారి బంతి చేతపట్టి ఓపిగ్గా క్రీజులో నిలిచిన పోరెల్‌ను బౌల్డ్‌ చేయడంతో 16.3 ఓవర్లలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు

ఢిల్లీ: సాహిల్‌ (బి) భువనేశ్వర్‌ 0, రాహుల్‌ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 1, నితీశ్‌ రాణా (సి) పడిక్కళ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 1, సమీర్‌ రిజ్వీ (సి) జితేశ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 0, స్టబ్స్‌ (సి) పడిక్కళ్‌ (బి) భువనేశ్వర్‌ 5, అక్షర్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 0, అభిషేక్‌ పోరెల్‌ (బి) హాజెల్‌వుడ్‌ 30, మిల్లర్‌ (సి) జితేశ్‌ (బి) రసిఖ్‌ 19, జేమిసన్‌ (ఎల్బీ) క్రునాల్‌ 12, కుల్దీప్‌ (బి) సుయాశ్‌ 3, చమీర (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 16.3 ఓవర్లలో 75 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-2, 3-2, 4-7, 5-7, 6-8, 7-43, 8-62, 9-71, 10-75; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-5-3, హాజెల్‌వుడ్‌ 3.3-0-12-4, రసిఖ్‌ 2-0-21-1, షెఫర్డ్‌ 2-0-21-0, సుయాశ్‌ 4-1-7-1, క్రునాల్‌ 2-0-9-1.

బెంగళూరు: బెథెల్‌ (సి) నటరాజన్‌ (బి) జేమిసన్‌ 20, కోహ్లీ (నాటౌట్‌) 23, పడిక్కళ్‌ (నాటౌట్‌) 34; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం: 6.3 ఓవర్లలో 77/1; వికెట్‌ పతనం: 1-26; బౌలింగ్‌: జేమిసన్‌ 3-0-42-1, చమీర 2-0-18-0, అక్షర్‌ 1-0-5-0, నటరాజన్‌ 0.3-0-12-0.

1

ఐపీఎల్‌ పవర్‌ప్లేలో అత్యల్ప స్కోరు (13) నమోదు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌. రాజస్థాన్‌ (14/2)ను అధిగమించింది. అలాగే పవర్‌ప్లేలోనే ఇద్దరు బౌలర్లు (భువనేశ్వర్‌, హాజెల్‌వుడ్‌) మూడేసి వికెట్లు తీయడం ఇదే తొలిసారి.

2

పవర్‌ప్లేలోపే ఎక్కువ వికెట్లు (6) కోల్పోయిన రెండో జట్టుగా ఢిల్లీ. గతంలో కొచ్చి టస్కర్‌ కూడా ఇన్నే వికెట్లు కోల్పోయింది.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 7 6 0 1 13 1.333

బెంగళూరు 8 6 2 0 12 1.919

హైదరాబాద్‌ 8 5 3 0 10 0.815

రాజస్థాన్‌ 8 5 3 0 10 0.602

గుజరాత్‌ 8 4 4 0 8 -0.475

చెన్నై 8 3 5 0 6 -0.121

ఢిల్లీ 8 3 5 0 6 -1.060

కోల్‌కతా 8 2 5 1 5 -0.751

ముంబై 7 2 5 0 4 -0.736

లఖ్‌నవూ 8 2 6 0 4 -1.106

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 28 , 2026 | 03:03 AM