ఆసియా క్రీడలు.. అదనపు సభ్యులను చేర్చాలని కోరకండి: ఓసీఏ
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:17 PM
ఆసియా క్రీడలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆతిథ్య దేశం జపాన్ కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని నగోయా వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆతిథ్య దేశం జపాన్ కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని నగోయా వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. మొత్తం 45 దేశాలకు చెందిన క్రీడాకారులు 43 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రీడల్లో పాల్గొనే బృందాల విషయంలో నిర్వాహకులు కీలక పరిమితి విధించారు. స్థల కొరత కారణంగా 15,000 మందికి మించి ఆతిథ్యం ఇవ్వడం సాధ్యం కాదని జపాన్ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) సభ్య దేశాలకు కీలక సూచనలు చేసింది. తమ బృందాల పరిమాణాన్ని నిర్దేశిత పరిమితుల్లోనే ఉంచాలని.. చివరి నిమిషంలో అదనపు సభ్యులను చేర్చాలని కోరవద్దని స్పష్టం చేసింది. క్రీడాకారుల నామినేషన్ల గడువు ఇప్పటికే గత నెలలో ముగిసింది. అయితే ఆ తర్వాత కూడా పలువురు సభ్య దేశాల నుంచి ఆలస్యంగా పేర్లను చేర్చాలంటూ వచ్చిన అభ్యర్థనలను ఓసీఏ పరిశీలించింది. అయితే ప్రస్తుతం నిర్వాహకులు 15 వేల మంది పరిమితిని దాటేందుకు వీల్లేదని తేల్చిచెప్పడంతో ఇకపై కొత్తగా ఎలాంటి అభ్యర్థనలను స్వీకరించబోమని ఓసీఏ స్పష్టం చేసింది.
రీప్లేస్‌మెంట్‌కు మాత్రమే అవకాశం..
ఇకపై కొత్తగా సభ్యులను జోడించేందుకు అనుమతి ఉండదని.. అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటికే ఎంపికైన సభ్యుల స్థానంలో మరొకరిని రీప్లేస్‌మెంట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నుంచి వచ్చిన ఈ సూచనలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వర్గాలు కూడా ధ్రువీకరించాయి.
35 క్రీడాంశాల్లో భారత్..
నగోయా ఆసియా క్రీడల్లో భారత్ భారీ బృందంతో బరిలోకి దిగనుంది. క్రికెట్, హాకీ, రెజ్లింగ్, ఆర్చరీ తదితర క్రీడలు సహా మొత్తం 35 క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు పోటీపడనున్నారు. భారత్ తరఫున మొత్తం 492 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో అత్యధికంగా అథ్లెటిక్స్ విభాగం నుంచే 73 మంది బరిలోకి దిగనున్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట
పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!