Share News

భారత బాక్సర్లకు గుడ్‌న్యూస్.. ఆసియా పతకం సాధిస్తే నేరుగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంట్రీ

ABN , Publish Date - Sep 16 , 2026 | 08:04 PM

భారత బాక్సర్లకు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (BFI) కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించింది.

భారత బాక్సర్లకు గుడ్‌న్యూస్.. ఆసియా పతకం సాధిస్తే నేరుగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంట్రీ
Asian Games 2026

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత బాక్సర్లకు బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (BFI) కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించింది. 2027 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌.. 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌గా ఉండనుంది. ఈ టోర్నీకి వీలైనంత ఎక్కువ మంది భారత బాక్సర్లను పంపించడమే లక్ష్యంగా బీఎఫ్ఐ నాలుగు దశలతో కూడిన అర్హత విధానాన్ని రూపొందించింది.


2026 ఆసియా గేమ్స్‌లో పతకం సాధించిన బాక్సర్‌కు.. పోటీ చేసిన వెయిట్‌ కేటగిరీలో 2027 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు ప్రధాన ఎంట్రీ లభిస్తుంది. అదే వెయిట్‌ కేటగిరీలో 10వ ఎలైట్‌ నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించిన బాక్సర్‌ను రిజర్వ్‌ ఎంట్రీగా పరిగణిస్తారు. ఒకవేళ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఏ వెయిట్‌ కేటగిరీలోనూ పతకం రాకపోతే.. ఆ విభాగంలో 10వ ఎలైట్‌ నేషనల్స్‌ విజేతను ప్రధాన ఎంట్రీగా ఎంపిక చేస్తారు. ఆసియా గేమ్స్‌లో నిర్వహించని ఒలింపిక్‌ వెయిట్‌ కేటగిరీలకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది.


వారికి కూడా..

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో కోటా బౌట్‌ దశకు చేరుకున్నప్పటికీ.. ఒలింపిక్‌ కోటా సాధించలేకపోయిన బాక్సర్లకు కూడా ప్రత్యేక అవకాశం కల్పించారు. అలాంటి బాక్సర్లకు ఆసియా క్వాలిఫయర్స్‌లో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన స్థానాలను ర్యాంకింగ్స్‌ ఆధారంగా నిర్వహించే సెలెక్షన్‌ ట్రయల్స్‌ ద్వారా భర్తీ చేస్తారు. అయితే ఈ ట్రయల్స్‌లో పాల్గొనాలంటే ముందుగా నిర్దేశిత అర్హత మార్గాల ద్వారా జాతీయ శిక్షణ శిబిరంలో చోటు సంపాదించాలి. 2028లో జరగనున్న రెండు వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్లకు భారత బాక్సర్ల ఎంపికలోనూ ఇదే విధానాన్ని అనుసరించనున్నారు. ఈ టోర్నమెంట్లు ఇటలీ, హంగరీలో జరగనున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా

Updated Date - Sep 16 , 2026 | 08:22 PM