Share News

స్వదేశానికి చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్లు.. మెస్సి మాత్రం!

ABN , Publish Date - Jul 21 , 2026 | 12:06 PM

విశ్వ సాకర్ సంబరంలో చివరికి అర్జెంటీనాను ఓడించి.. స్పెయిన్‌ ట్రోఫీని ముద్దాడింది. తుది పోరులో ఓటమి పాలైనప్పటికీ స్వదేశానికి తిరిగి వచ్చిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులు మద్దతుగా నిలిచారు.

స్వదేశానికి చేరుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్లు.. మెస్సి మాత్రం!
Argentina football team

స్పోర్ట్స్ డెస్క్: 39 రోజులు.. 104 మ్యాచ్‌లు. రసవత్తరంగా సాగిన ఫిఫా ప్రపంచ కప్ 2026 సంబరం ముగిసింది. ఎన్నో హోరాహోరీ సమరాలు, సంచనాలు, కళ్లు చెదిరే గోల్స్, స్టార్‌ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఈ ప్రపంచకప్‌ నిలిచింది. ఇలాంటి విశ్వ సాకర్ సంబరంలో చివరికి అర్జెంటీనాను ఓడించి... స్పెయిన్‌ ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. తుది పోరులో ఓటమి పాలైనప్పటికీ స్వదేశానికి తిరిగి వచ్చిన అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకు అభిమానులు మద్దతుగా నిలిచారు. 2022లో టైటిల్ గెలిచిన సమయంలో మాదిరిగానే ఈ సారి ఓడినప్పటికీ ప్లేయర్లకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.


ఈ ఫిఫా టోర్నీలో అర్జెంటీనా జట్టు చూపించిన పోరాట పటిమకు కృతజ్ఞతగా వేలాది మంది మద్దతుదారులు విమానాశ్రయం వెలుపల గుమిగూడారు. ఈజిజా విమానాశ్రయం వద్ద వర్షం, చలిని సైతం లెక్కచేయకుండా అభిమానులు తమ జాతీయ జెండాలను పట్టుకుని ఆటగాళ్ల కోసం నిరీక్షించారు. ఈ క్రమంలోనే కోచ్ లియోనెల్ స్కలోని నేతృత్వంలోని జట్టుకు మిలటరీ బ్యాండ్, రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ చోటుచేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి మాత్రం స్వదేశానికి రాలేదు. దీంతో కొందరు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


వ్యక్తిగత కారణాలతో మెస్సితో పాటు మరికొందరు ఆటగాళ్లు అమెరికాలోనే ఉన్నారని, అందుకే ఈ విమానంలో రాలేదని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) తెలిపింది. మరోవైపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ప్రసిద్ధ ఓబెలిస్క్ ప్రాంతంలో ఆదివారం రాత్రి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని బాణసంచా కాలుస్తూ వేడుకలు చేసుకున్నారు. అయితే రాత్రి సమయంలో కొందరు నిరసన కారులు, పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫైనల్‌లో గెలవలేకపోయినా, ఈ ప్రపంచకప్‌లో అర్జెంటీనా ప్రదర్శనను అభిమానులు కొనియాడుతున్నారు. ముఖ్యంగా ఫాక్‌లాండ్ దీవుల విషయంలో ఇంగ్లండ్‌తో వివాదం ఉన్న నేపథ్యంలో ఆ జట్టును 2-1తో తేడాతో సెమీ ఫైనల్‌లో ఓడించడమే తమకు టైటిల్ గెలవడంతో సమానమని అర్జెంటీనా అభిమానులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

బ్యాటింగ్ ఆర్డర్‌ను గంభీర్ నాశనం చేస్తున్నాడు: కృష్ణమాచారి శ్రీకాంత్

కోహ్లీ సలహా సింధు ఆటను మార్చేసింది: దత్త సాయి

Updated Date - Jul 21 , 2026 | 12:46 PM