వన్డే ప్రపంచ కప్ జట్టులో రోహిత్ స్థానం ఖాయం: అంబటి రాయుడు
ABN , Publish Date - Jun 30 , 2026 | 09:22 AM
వన్డే ప్రపంచ కప్ 2027 నేపథ్యంలో రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు. తుది జట్టులో రోహిత్ స్థానం ఖాయమని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్‌పై టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో ఓడిపోయిన భారత్ జట్టు ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనపై దృష్టి సారించింది. జులై 1 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాల్లో భాగంగా జరిగే ఈ సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు గాయం కారణంగా విరాట్ దూరమైన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నిలకడగా రాణిస్తూ జట్టుకు కీలక ఆడగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్‌గా మలచలేకపోతున్నాడని, అతడి స్థానంలో యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించాడు.
‘రోహిత్ శర్మ విషయంలో స్పష్టత చాలా ముఖ్యం. టీమ్ మేనేజ్‌మెంట్ అతడి ఆట గురించి ఓ స్పష్టత ఇచ్చే ఉంటుందని భావిస్తున్నా. ప్రపంచ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ కచ్చితంగా ఉంటాడు. అతడి అనుభవం జట్టుకు అవసరం. మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఓ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించగలడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీని తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు.. కానీ పెద్ద టోర్నీల్లో రోహిత్ శర్మ ఉండటం చాలా అవసరం. అతడి బ్యాటింగ్‌లో ఓ స్పెషాలిటీ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లలో కొన్నిసార్లు ఆకలి తగ్గినట్లు కనిపించొచ్చు. కానీ ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీ లేదా ఇంగ్లండ్ సిరీస్ వంటి కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తాడనే నమ్మకం నాకుంది’ అని అంబటి రాయుడు వెల్లడించాడు.
ఆశ్చర్యంగా అనిపించింది..
ఇంగ్లండ్ సిరీస్‌కు యశస్వి జైస్వాల్ ఎంపికవ్వని సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా అంబటి రాయుడు స్పందించాడు. ‘అఫ్గానిస్తాన్‌పై సెంచరీ బాదిన జైస్వాల్‌ను పక్కన పెట్టడం ఆశ్చర్యంగా అనిపించింది. నా దృష్టిలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరికీ భారత జట్టులో స్థానం దక్కాలి. రోహిత్ గొప్ప బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన నాయకుడు కూడా. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడి అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. అదే సమయంలో జైస్వాల్ కూడా ఈ అవకాశానికి పూర్తిగా అర్హుడు’ అని రాయుడు స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు: కైఫ్
ఫిఫా ప్రపంచ కప్: పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే సంచలన విజయం