బీసీసీఐకి ఏదీ అనుకూలంగా లేదు.. గ్రూపింగ్ అంశంపై ఆకాశ్ చోప్రా ఆగ్రహం
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:05 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో ఎనిమిది జట్లు సూపర్ 8కి అర్హత సాధించాయి. వీటిని నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. అయితే ఈ గ్రూపింగ్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో లీగ్ స్టేజి ముగిసిన విషయం తెలిసిందే. ఎనిమిది జట్లు సూపర్ 8కి అర్హత సాధించాయి. వీటిని నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా ఐసీసీ విభజించింది. గ్రూప్ 1లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఉన్నాయి. గ్రూప్ 2లో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. అయితే ఈ గ్రూపింగ్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. టీమిండియాకు అనుకూలంగా బీసీసీఐ గ్రూపింగ్ విషయంలో మార్పులు చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ఈ ప్రపంచ కప్ టోర్నీకి భారత్-శ్రీలంక ఆతిథ్యమిస్తున్నాయి. కాబట్టి టీమిండియా తన మ్యాచులన్నీ భారత్‌లోనే ఆడాల్సి ఉంది. శ్రీలంక, పాకిస్థాన్ తమ మ్యాచులు శ్రీలంకలోనే ఆడాల్సి ఉంది. భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉండకూడదు అనుకున్నప్పుడు.. టీమిండియా మరో గ్రూప్‌లోనే కదా ఉండేది. అలా లేకపోతే టోర్నీ ఎలా ముందుకు సాగుతుంది? చాలామంది ఈ గ్రూపింగ్ బీసీసీఐకి అనుకూలంగా ఉందంటున్నారు. నిజానికి దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి బలమైన జట్లు తమ గ్రూపులో ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఆస్ట్రేలియా ఓడిపోయి జింబాబ్వే సూపర్ 8కి వస్తుందని ఎవరైనా ఊహించారా? అందుకే దీన్ని బలహీనమైన గ్రూప్‌గా చూడకండి. మాట్లాడే ముందు కాస్త పరిశోధన చేయండి. నోటికొచ్చినట్లు మాట్లాడకండి.
గ్రూప్ స్టేజిలో టేబుల్ టాప్‌లో ఉండటం వల్ల జట్లకు ప్రయోజనం లేకుండా ప్రస్తుతం గ్రూపింగ్ చేశారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఇలాంటి గ్రూపింగ్ జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. 2007, 2009, 2010, 2012లోనూ ఇలానే గ్రూపింగ్ చేశారు. అప్పుడు కూడా టేబుల్ టాపర్లు ఒకే గ్రూప్‌లో ఉన్నారు’ అని ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8 వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!