Share News

పాకిస్థాన్‌తో వివాదం.. పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం

ABN , Publish Date - Feb 12 , 2026 | 04:25 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వేలంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆఖరి నిమిషంలో ఈ వేలం నుంచి అఫ్గానిస్తాన్ ప్లేయర్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలే దీనికి కారణమని సమాచారం.

పాకిస్థాన్‌తో వివాదం.. పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం
PSL

ఇంటర్నెట్ డెస్క్: లాహోర్ వేదికగా జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 11వ ఎడిషన్‌కు ముందు నిర్వహించిన ఆక్షన్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అఫ్గానిస్తాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లు తమ పేర్లను వేలం నుంచి ఉపసంహరించుకున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం వల్ల వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


ముజీబుర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, ఫజల్ హక్ ఫారూఖీ, సిద్దికుల్లా అతల్, వకార్ సలామ్‌ఖేల్ వంటి ఆటగాళ్లు తొలుత వేలానికి రిజిస్టర్ అయినట్లు పీఎస్ఎల్‌(PSL)లో ఓ ఫ్రాంచైజీ యజమాని వెల్లడించారు. అయితే పేషావర్ జల్మీ జట్టు రహ్మానుల్లా గుర్భాజ్‌(Rahmanullah Gurbaz)ను నేరుగా తీసుకోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుర్భాజ్ స్వయంగా పీఎస్ఎల్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మిగతా అఫ్గాన్ ఆటగాళ్లు కూడా వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వేలం నుంచి తమ పేర్లు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.


అయితే పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్ మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించారు. ‘వేలంలో కొంత మంది అఫ్గాన్ ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఏ ఫ్రాంచైజీ కూడా వారిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా దీనికి కారణం అవ్వొచ్చు’ అని తెలిపారు.


కాగా గతేడాది పాకిస్థాన్ సైన్యం అఫ్గానిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ పరిణామాలపై అఫ్గాన్ ఆటగాళ్లు సోషల్ మీడియాలో స్పందించగా, పాకిస్థాన్ వర్గాల నుంచి కూడా ప్రతిస్పందనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ వేలంలో అఫ్గాన్ ఆటగాళ్ల ఉపసంహరణ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


ఇవి కూడా చదవండి:

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Updated Date - Feb 12 , 2026 | 05:03 PM