Share News

అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:48 PM

టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ (గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

 అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో అర్ష్‌దీప్ సింగ్
Arshdeep Singh

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) అరుదైన రికార్డుకు 4 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇవాళ(గురువారం) సాయంత్రం నమీబియాతో జరగనున్న మ్యాచ్ లో ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. బంతిని రెండు వైపులూ స్వింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం ఈ యువ బౌలర్ ప్రత్యేకత. మరి.. అర్ష్‌దీప్ సింగ్ ముందున్న రికార్డు ఏంటి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


ఈ ఐసీసీ టోర్నీలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మరో నాలుగు వికెట్లు తీస్తే అతడు టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ ఘనత భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పేరిట ఉంది. ఈ స్పిన్నర్ తన కెరీర్‌లో 24 పొట్టి ప్రపంచ కప్ మ్యాచులు ఆడి.. 32 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ప్రస్తుతం అర్ష్‌దీప్‌ సింగ్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. అతడు కేవలం 15 మ్యాచుల్లో ఈ వికెట్లను సాధించాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా 26 వికెట్లు(18 మ్యాచులు), హార్దిక్‌ పాండ్య 24 వికెట్లు (25 మ్యాచులు), రవీంద్ర జడేజా22 వికెట్ల(30 మ్యాచులు)తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


అర్ష్‌దీప్‌ జులై 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అతడి తొలి టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా పాకిస్థాన్‌తో 2022లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతడు 32 పరుగులిచ్చి, నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అలానే టీ20 వరల్డ్‌కప్‌-2024లో 8 మ్యాచుల్లో 17 వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లో ఒక ఎడిషన్‌లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా టీ20 ప్రపంచకప్(T20 World Cup) మ్యాచుల్లో ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా బంగ్లాదేశ్‌ మాజీ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఉన్నాడు. అతడు 2007 నుంచి 2024 మధ్య 43 మ్యాచుల్లో 50 వికెట్లు తీసుకున్నాడు. ఇవాళ సాయంత్రం ఢిల్లీ వేదికగా భారత్, నమీబియాతో తలపడనుంది.


టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్లు

  • రవిచంద్రన్ అశ్విన్-24 మ్యాచులు-32వికెట్లు

  • అర్ష్‌దీప్ సింగ్-15మ్యాచులు-29 వికెట్లు

  • జస్‌ప్రీత్ బుమ్రా-18 మ్యాచులు- 26 వికెట్లు

  • హార్దిక్ పాండ్యా-25 మ్యాచులు-24వికెట్లు

  • రవీంద్ర జడేజా-30 మ్యాచులు-22 వికెట్లు


టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ బౌలర్లు

  • షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- 50 వికెట్లు (43 మ్యాచులు)

  • వానిండు హసరంగా(శ్రీలంక)-40 వికెట్లు (20 మ్యాచులు)

  • ఆడమ్ జంపా(ఆస్ట్రేలియా)- 40 వికెట్లు (22మ్యాచులు)

  • రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్)-40 వికెట్లు (25 మ్యాచులు)

  • షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్)- 39 వికెట్లు (34 మ్యాచులు)


ఇవి కూడా చదవండి:

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

పసికూనతో పోరు

Updated Date - Feb 12 , 2026 | 03:26 PM