Share News

కరేబియన్ జట్టుకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్..

ABN , Publish Date - Jan 20 , 2026 | 07:05 PM

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు 38 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది..

 కరేబియన్ జట్టుకు షాకిచ్చిన అఫ్గానిస్తాన్..
Afghanistan vs West Indies

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు వెస్టిండీస్‌కు వరుసగా షాకులిస్తోంది. తాజాగా మరోసారి ఊహించని షాకిచ్చింది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో(Afghanistan vs West Indies ) విండీస్ జట్టును అఫ్గాన్ ఓడించింది. 38 పరుగుల తేడాతో అఫ్గాన్ ఘన విజయం సాధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్, వెండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన అఫ్గాన్.. తొలుత బ్యాటింగ్‌‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లు మూడు వికెట్లు కోల్పోయి.. 181 పరుగులు చేసింది. ప్రారంభంలో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టు.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇబ్రహీం జద్రాన్‌ (56 బంతుల్లో 87 నాటౌట్‌), దర్విష్‌ రసూలీ(Darwish Rasooli)(59 బంతుల్లో 84) విండీస్ బౌలర్లపై చెలరేగి ఆడటంతో ఆ జట్టు భారీ స్కోర్‌ చేసింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్‌ డకౌట్‌ కాగా.. సెదిఖుల్లా అటల్‌ 2 పరుగులు మాత్రమే చేశాడు. కరేబియన్ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, మాథ్యూ ఫోర్డ్‌ తలో వికెట్‌ తీశారు.


అనంతరం 182 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. ఆది నుంచి తడబడింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సాంప్సన్‌ (30) టాప్‌ స్కోరర్‌గా కాగా.. జాన్సన్‌ ఛార్లెస్‌ (27), మోటీ (28), ఫోర్డ్‌ (25) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటరల్లో ఎవిన్‌ లూయిస్‌, బ్రాండన్‌ కింగ్‌ చెరో 4, జాంగూ, హెట్‌మైర్‌, పియెర్రీ తలో 3 పరుగులు చేసి ఔటయ్యారు. అఫ్గాన్(Afghanistan) బౌలర్లలో జియా ఉర్‌ రెహ్మాన్‌ 3 వికెట్లు సాధించగా.. రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ , నూర్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దర్విష్‌ రసూలీ అందుకున్నాడు. ఈ సిరీస్‌లోని రెండో టీ20 రేపు (జనవరి 21) ఇదే వేదికగా జరుగనుంది.


ఇవి కూడా చదవండి:

రో- కోకు డిమోషన్.. సెంట్రల్ కాంట్రాక్టుల్లో ‘బి గ్రేడ్’?

సమీపిస్తోన్న టీ20 ప్రపంచ కప్‌.. వివాదంలో రింకూ సింగ్!

Updated Date - Jan 20 , 2026 | 07:31 PM