ఆకిబ్ నబీ ఎంపిక విషయంలో సెలెక్టర్లదే తుది నిర్ణయం: బీసీసీఐ
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:44 PM
రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆకిబ్ నబీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో నబీ గురించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నబీ ఎంపిక విషయంపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆకిబ్ నబీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించాడు. తొలి సారి జమ్ము రంజీ ట్రోఫీని గెలవడంలో నబీ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని వెంటనే జాతీయ జట్టులోకి తీసుకోవాలంటూ విపరీతంగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నబీ గురించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నబీ ఎంపిక విషయంపై స్పందించాడు.
‘నబీ అద్భుతంగా ఆడాడు. జమ్ము కశ్మీర్ జట్టు విజయం సాధించేందుకు అతడిదే కీలక పాత్ర. తన సంచలన ప్రదర్శనతో అందరి దృష్టి నబీపై పడింది. జాతీయ జట్టుకు తీసుకోవాలంటూ డిమాండ్లు వచ్చాయి. రంజీ ట్రోఫీలో జరిగిన ప్రతి మ్యాచ్‌కు సెలెక్టర్లు హాజరయ్యారు. ప్రతిభావంతులను గమనించారు. నబీ ఎంపిక విషయంలో జాతీయ సెలెక్టర్లదే తుది నిర్ణయం. మారుమూల పట్టణాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రికెటర్లకు అవకాశాలు దక్కుతున్నాయంటే బీసీసీఐ ఏర్పాటు చేసిన వ్యవస్థ ఫలితమే. అయితే నబీని ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం జమ్ముకశ్మీర్ సెలెక్టర్లే.. బీసీసీఐ కాదు. కానీ దేశీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తే జాతీయ సెలెక్టర్లు తప్పకుండా గమనిస్తారు’ అని సైకియా వెల్లడించాడు.
ఈ సీజన్ రంజీ ట్రోఫీలో నబీ సంచలన ప్రదర్శనలు చేశాడు. 10 మ్యాచ్‌లు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. దీంతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తన చెలరేగి ఆడి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తాజాగా సైకియా వ్యాఖ్యలతో నబీ జాతీయ జట్టులోకి రావడం ఖాయమే అనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్ 2026: సెమీస్‌కు మ్యాచ్ రెఫరీలు వీరే!
కోహ్లీ ఎప్పటికీ ఆర్సీబీని వీడడు: మో బోబాట్