యూట్యూబర్ ఇంట్లో భారీ దోపిడీ.. హోమ్ టూర్ వీడియో చూసి చోరీ..
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:26 PM
ఓ మహిళా యూట్యూబర్‌కి దొంగలు భారీ షాక్ ఇచ్చారు. హోమ్ టూర్ వీడియో చేస్తూ బంగారం, వెండి వస్తువులను ప్రదర్శించిన యూట్యూబర్ ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఏకంగా లక్షల విలువైన బంగారాన్ని, నగదును స్వాహా చేశారు.
మధ్యప్రదేశ్: ఓ మహిళా యూట్యూబర్‌కి దొంగలు భారీ షాక్ ఇచ్చారు. హోమ్ టూర్ వీడియో చేస్తూ బంగారం, వెండి వస్తువులను ప్రదర్శించిన యూట్యూబర్ ఇంటిని దుండగులు కొల్లగొట్టారు. ఏకంగా లక్షల విలువైన బంగారాన్ని, నగదును స్వాహా చేశారు. అందరూ నిద్రిస్తుండగా ప్రవేశించిన దొంగలు బాధిత కుటుంబ సభ్యులను బంధించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ శివపురి జిల్లా మోహని గ్రామానికి చెందిన రచనా గుర్జర్ యూట్యూబ్ వీడియోలు చేస్తుంటుంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి దాదాపు లక్ష మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అయితే, గుర్జర్ ఇటీవల హోమ్ టూర్ పేరుతో ఓ వీడియో చేసింది. ఈ సందర్భంగా తన ఇంటిని మెుత్తాన్ని వీడియో తీసి నెట్టింట పెట్టింది. ప్రధాన ద్వారం, ఎన్ని గదులు ఉంటాయి, ఎంత మంది ఉంటారనే విషయాలను వీడియోలో చూపించింది. అలాగే మరో వీడియోలో తన బంగారు, వెండి ఆభరణాలను ఓ టేబుల్‌పై పెట్టి ప్రదర్శించింది. ఈ సందర్భంగా పాటలు పాడుతూ నగల గురించి వివరించింది. ఆ తర్వాత ఇదే ఆమె చేసిన అతి పెద్ద తప్పుగా మారింది.
ఆ వీడియోలను చూసిన గుర్తుతెలియని దుండగులు.. యూట్యూబర్ రచనా గుర్జర్ ఇంటిలో దొంగతనానికి పథకం వేశారు. గత శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుర్జర్ ఇంటిలోకి చొరబడ్డారు. అందరూ నిద్రిస్తున్న గది తలుపునకు తాళం వేశారు. సీసీకెమెరాల్లో కనిపించకుండా వాటి యాంగిల్స్‌ని మార్చేశారు. అనంతరం బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. వాటి మెుత్తం విలువ సుమారు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే, ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో బయటకు వచ్చేందుకు గుర్జర్ ప్రయత్నించగా.. తాళం వేసి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయింది.
వెంటనే బంధువులకు ఫోన్ చేయగా ఇంటికి వచ్చి తాళాలను పగలకొట్టి యూట్యూబర్ కుటుంబాన్ని విడిపించారు. అనంతరం దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని నర్వార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు తెలిసేలా వీడియోలు పెట్టొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా చేస్తే ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ మాటల్ని పట్టించుకోని ఇజ్రాయెల్!.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి