హాల్ టికెట్లో కుక్క ఫొటో.. ఓ నిరుద్యోగ అభ్యర్థికి వింత అనుభవం.!
ABN , Publish Date - Mar 12 , 2026 | 10:17 AM
ఓ నిరుద్యోగ అభ్యర్థి కోర్టు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగా.. హాల్ టికెట్లో తన ఫొటో స్థానంలో కుక్క పిక్ రావడం షాక్‌కు గురయ్యాడు. ఈ విషయంలో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని అతడు వాపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో ఓ నిరుద్యోగ అభ్యర్థికి వింత అనుభవం ఎదురైంది. కోర్టు కొలువు కోసం దరఖాస్తు చేసుకున్న ఆ అభ్యర్థి అడ్మిట్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోగా.. అందులో తన ఫొటో ఉండాల్సిన స్థానంలో శునకం చిత్రం కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే...
రాకేశ్ కుమార్ అనే ఓ నిరుద్యోగ విద్యార్థి.. రోహ్తాస్ జిల్లా కోర్టులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అప్లై చేసేటప్పుడు తన ఫొటోను సక్రమంగానే అప్లోడ్ చేసినట్టు చెప్పాడు రాకేశ్. దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక సంబంధిత అక్నాలెడ్జ్‌మెంట్ కాపీని కూడా పొందాడు. కానీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోగా.. అందులో తన ఫొటో స్థానంలో కుక్క ఫొటో వచ్చింది. ఈ విషయమై సంబంధిత నియామక అధికారికి రాకేశ్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
అయితే.. పరీక్షా సమయం దగ్గర పడుతున్నా అతడికి ఇంకా ఆ అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఎలాంటి అంతరాయం కలగకండా వీలైనంత త్వరగా అధికారులు స్పందించి.. ఈ పొరపాటును సరిదిద్దాలని రాకేశ్ అభ్యర్థిస్తున్నాడు.
ఇవీ చదవండి:
హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..
ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు