ఈ ఖడ్గాలు... ప్రేమకు చిహ్నాలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 01:08 PM
పేద్ద కత్తులు... ఆకాశం నుంచి ఎవరో రాయిలో దింపినట్టుగా ఉంటాయి. దూరం నుంచి ఆ దృశ్యం చూసి తీరాల్సిందే.
పేద్ద కత్తులు... ఆకాశం నుంచి ఎవరో రాయిలో దింపినట్టుగా ఉంటాయి. దూరం నుంచి ఆ దృశ్యం చూసి తీరాల్సిందే. ఇంతకీ అంత పెద్ద కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఆ రాతి కొండపై పెట్టిందెవరు? ఆ విశేషాలు తెలియాలంటే నార్వే వెళ్లాల్సిందే.
పూర్వకాలంలో జరిగిన సంఘటనలను కథలు కథలుగా చెప్పుకోవడం తెలిసిందే. అలాంటి కథే ఈ కత్తుల వెనక ఉంది. అయితే అదొక ప్రేమయుద్ధం కథ. మూడు పెద్ద కత్తులు రాయిలో దింపిన దృశ్యం... నార్వేలో స్టావాంజర్ మున్సిపాలిటీ పరిధిలోని హఫ్రస్‌జోర్డ్ ప్రాంతంలో కనిపిస్తుంది. దీనిని ‘స్వెర్డ్ ఐ జెల్’ అని పిలుస్తారు. నార్వే భాషలో ‘కొండలో కత్తులు’, ‘రాతిలో కత్తులు’ అని అర్థం. ఇదొక స్మారక చిహ్నం. నార్వే ఏకీకరణను సూచిస్తుంది.
ప్రేమ‘యుద్ధం’
పూర్వం హరాల్డ్ ఫెయిర్‌హైర్ అనే యోధుడు ఉండేవాడు. అతను రాజకుమారి గైడా ఎరిక్స్‌తో ప్రేమలో పడ్డాడు. అయితే గైడా అతని ప్రేమను తిరస్కరించింది. అతను శక్తిమంతుడు కాదని అనుకుంది. కానీ గైడా మనసు గెలుచుకునేందుకు హరాల్డ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. నార్వేలోని విడిపోయిన ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు యుద్ధం చేశాడు. 872లో జరిగిన హఫ్రస్‌జోర్డ్ యుద్ధం అదే అని చరిత్రకారులు అంటారు. వివిధ వర్గాలను ఏకం చేసిన హరాల్డ్... ఆ తర్వాత నార్వే మొదటి రాజు అయ్యాడు. అంతేకాకుండా గైడా ప్రేమను సైతం గెలుచుకున్నాడు. హరాల్డ్ సాధించిన విజయాలను నార్వే ప్రజలు ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటారు.
అది జరిగిన చాలా ఏళ్లకు 1980లో కింగ్ ఒలావ్ ‘హరాల్డ్’ గౌరవార్థం ఒక శిల్పాన్ని రూపొందించాలని నిర్ణయించారు. ఆ పనిని శిల్పి ఫ్రిట్జ్ రోడ్‌కు అప్పగించారు. 1893లో శిల్ప నిర్మాణ ప్రక్రియను ఒలావ్ ప్రారంభించారు. మూడు పెద్ద కత్తులు రాయిపై దించి ఉన్నట్టుగా డిజైన్ ఉంటుంది. నార్వేలోని వివిధ ప్రాంతాలలో కనిపించే పిడి రకాలను పోలి ఉండే విధంగా కత్తుల పిడులు రూపొందించారు. మూడు కత్తుల పిడులు మూడు రకాలుగా ఉంటాయి. ఒక్కో కత్తి 30 అడుగుల పొడవు ఉంటుంది. ఈ కత్తులు శాంతి, ఐక్యత, స్వేచ్ఛను సూచిస్తాయి.
హఫ్రస్‌జోర్డ్ ప్రాంతం 9 కి.మీ పొడవుంటుంది. ప్రసిద్ధ వినోద ప్రాంతంగానూ ఇది గుర్తింపు పొందింది. జోర్డ్ ప్రాంతంలో బైక్ మార్గం, నడక మార్గం ఉంటాయి. ఇక్కడి బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. చుట్టూ దట్టమైన అడవులు, జలపాతం, సరస్సు ఉన్నాయి. పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రదేశం పర్యాటకులకు కనువిందు చేస్తూ... ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News