Share News

సూర్యుడిపై ప్లాస్మా సుడిగుండాలు.. తొలిసారి విడుదలైన హై రిజల్యూషన్ ఫొటోలు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:33 PM

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్ డానియెల్ కె. ఇనోయే సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విడుదల చేశారు.

సూర్యుడిపై ప్లాస్మా సుడిగుండాలు.. తొలిసారి విడుదలైన హై రిజల్యూషన్ ఫొటోలు..
Sun Images

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్ డానియెల్ కె. ఇనోయే సాయంతో శాస్త్రవేత్తలు సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అత్యంత స్పష్టమైన చిత్రాలను విడుదల చేశారు. సూర్యుడిపై సూక్ష్మస్థాయిలో ఏర్పడే ప్లాస్మా సుడిగుండాలు (వోర్టెక్స్‌లు) ఈ చిత్రాల్లో తొలిసారి స్పష్టంగా కనిపించాయి (Sun Images).


ఈ సుడిగుండాలను కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ అస్థిరతలు (Kelvin–Helmholtz Instabilities) అని పిలుస్తారు. సూర్యుడిపై వేగంగా కదిలే వేడి ప్లాస్మా, నెమ్మదిగా కదిలే ప్లాస్మాతో ఢీకొన్నప్పుడు ఈ తరహా అలలు, సుడిగుండాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల క్రితమే ఊహించారు. అయితే ఆ ప్లాస్మా సుడిగుండాలను సూర్యుడి ఉపరితలంపై ఇంత స్పష్టంగా గమనించడం ఇదే తొలిసారి.

sun1.jpg


సూర్యుడిలో అయస్కాంత శక్తి ఎలా పేరుకుపోతుంది, ఎలా విడుదలవుతుంది అనే అంశాలపై కీలక సమాచారం ఈ పరిశోధన ద్వారా లభించనుంది. ముఖ్యంగా సౌర జ్వాలలు (Solar Flares), కరోనా మాస్ ఎజెక్షన్లు (CMEs) వంటి శక్తిమంతమైన ఘటనలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు (Plasma Whirlpools on Sun).


భూమిపై ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలు, రేడియో కమ్యూనికేషన్, విద్యుత్ గ్రిడ్‌లపై సౌర తుఫాన్లు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల సూర్యుడి ఉపరితలంలో జరిగే సూక్ష్మ మార్పులను అర్థం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో అంతరిక్ష వాతావరణాన్ని మరింత కచ్చితంగా అంచనా వేసే అవకాశాలు మెరుగుపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..


హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Updated Date - Aug 06 , 2026 | 06:44 PM