Share News

క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:17 PM

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా 'క్యా బోల్తీ పబ్లిక్' (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..
Kya Bolti Public Campaign

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దేశవ్యాప్తంగా 'క్యా బోల్తీ పబ్లిక్' (ప్రజలు ఏమంటున్నారు) పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతి ఒక్కరితోనూ మమేకమవుతామని తెలిపారు. సీజేపీ ఒక రాజకీయ పార్టీగా మారకుండా ఒక ఒత్తిడి బృందంగానే కొనసాగుతుందని దీప్కే ప్రకటించారు (CJP Abhijeet Dipke).


మహారాష్ట్రలో నిర్వహించిన పార్టీ ప్రధాన బృంద సమావేశం అనంతరం దీప్కే ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం లేదని, ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రెషర్ గ్రూప్‌గా పనిచేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో తగ్గుతున్న విశ్వాసం వంటి అంశాలపై ఉద్యమాన్ని మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంలో విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు (Kya Bolti Public Campaign).


'ఈ రోజు మన దేశంలో సంస్థాగత జవాబుదారీతనం ప్రమాదకర స్థితిలో ఉంది. ఇది మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకర సంకేతం. గతంలో ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునేవారు. ఈ రోజు ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తోంది. ప్రజాస్వామ్యం ఇలా పనిచేయదు. మనం ఎన్నికల సంఘం జవాబుదారీతనాన్ని సరిదిద్దాలి. మనం ఇది చేసేంత వరకు దేశంలో ఎన్నికల అవకతవకలు కొనసాగుతాయి' అని దీప్కే పేర్కొన్నారు. నిరుద్యోగం దేశంలో ఒక ప్రధాన సమస్య అని, దీనిని దేశవ్యాప్త సమస్యగా పరిగణిస్తామని దీప్కే తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..


హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు..

Updated Date - Aug 06 , 2026 | 05:18 PM