Sankranti Special Foods: గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:36 AM
సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సందడి మాత్రమే కాదు.. ఘుమ ఘుమలాడే వంటకాలే అసలైన ఆకర్షణ. అరిసెల నుంచి నువ్వుల లడ్డూ, పిన్నీ స్వీట్ నుంచి పాయేష్ వరకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సందడి.. పల్లెటూరి సంబరాలతో పాటు రుచికరమైన వంటకాల ఘుమ ఘుమలే గుర్తుకొస్తాయి. ప్రతి రాష్ట్రంలో ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, నువ్వుల ఉండలు వంటి పిండివంటలు ఎంత ప్రత్యేకమో.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సంక్రాంతి రోజున తప్పనిసరిగా చేసుకునే కొన్ని సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా సంక్రాంతి స్పెషల్‌గా ఏయే వంటకాలు ఉంటాయో తెలుసుకుందాం..
ఒడిశా – మకర చౌల
ఒడిశాలో సంక్రాంతి అంటే ముందుగా గుర్తుకొచ్చేది మకర చౌల. ఇది తీపి రుచితో కూడిన సంప్రదాయ వంటకం. కొత్త బియ్యం, బెల్లం, పాలు, అరటిపండు, చెరుకు రసం, యాలకులపొడి కలిపి తయారు చేసే ఈ స్వీట్ వాసనతోనే ఆకర్షిస్తుంది. పైన కొబ్బరి ముక్కలు చల్లడంతో అదనపు రుచినిస్తుంది. సంక్రాంతి రోజున ప్రతి ఒడియా ఇంట్లో మకర చౌల ఉండటం ఆనవాయితీ.

పంజాబ్ – పిన్నీ స్వీట్
సంక్రాంతి చలికాలంలో జరుపుకుంటాం. కాబట్టి శరీరానికి వేడి ఇచ్చే ఆహారం చాలా ముఖ్యం. ఈ విషయంలో పంజాబీలు పిన్నీకి పెద్దపీట వేస్తారు. గోధుమ పిండి, సేమోలినా, నెయ్యి, పంచదార, డ్రైఫ్రూట్స్‌తో చేసే ఈ స్వీట్ రుచికరంగా ఉండటమే కాదు.. శక్తినీ ఇస్తుంది. పంజాబ్‌లో సంక్రాంతి అంటే పిన్నీ స్వీట్ తప్పనిసరి.

మహారాష్ట్ర – నువ్వుల లడ్డు
మహారాష్ట్రలో మకర సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు నువ్వుల లడ్డూలు తినడం తప్పనిసరి. నువ్వులు, బెల్లం కలిపి చేసే ఈ లడ్డూలు శరీరానికి వేడి ఇస్తాయి. వీటిని ఒకరికొకరు పంచుకుంటారు.

బీహార్ – కిచిడీ
సాధారణంగా కిచిడీ అందరూ తింటారు. కానీ.. బిహార్‌లో మాత్రం సంక్రాంతి రోజున చేసే కిచిడీకి ప్రత్యేక స్థానం ఉంది. బియ్యం, పప్పు కలిపి నెయ్యితో ఘుమ ఘుమలాడేలా చేసే ఈ వంటకం ప్రతి బిహారీ ఇంట్లో తప్పకుండా ఉంటుంది. సంక్రాంతి రోజున కిచిడీ తినడాన్ని శుభంగా భావిస్తారు.

పశ్చిమ బెంగాల్ – పాయేష్
బెంగాలీలు తీపి వంటకాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మకర సంక్రాంతి రోజున పాయేష్(ఖీర్) చేయడం వారి సంప్రదాయం. పాలు, బియ్యం, బెల్లం లేదా చక్కెరతో తయారు చేసే ఈ పాయసం వండుతుంటేనే ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది.

సంక్రాంతి అంటే రుచుల సంబరం
ప్రాంతం మారినా.. సంప్రదాయం మారినా.. సంక్రాంతి పండుగను ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ వంటకాలే. ప్రతి రాష్ట్రం తమ తమ సంప్రదాయ రుచులతో ఈ పండుగను జరుపుకుంటుంది. అందుకే.. ఈ ప్రత్యేక వంటకాలు తింటేనే నిజంగా సంక్రాంతి పండుగ చేసిన ఆనందం దక్కుతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News