Sankranti Cultural Significance: హరిదాసు, బసవన్న సంప్రదాయాలు సంక్రాంతికే ఎందుకు కనిపిస్తాయి?
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:55 AM
సంక్రాంతి అంటే చాలు.. హరిదాసుల హరినామ సంకీర్తనలు, గంగిరెద్దుల గజ్జెల శబ్దాలతో ఊరువాడ పండుగ వాతావరణంలో మునిగిపోతుంది. కానీ ఈ సంప్రదాయాలు సంక్రాంతికే ఎందుకు కనిపిస్తాయి? హరిదాసులు, గంగిరెద్దుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి అంటే చాలు.. ఊరువాడ అంతా పండుగ వెలుగులతో నిండిపోతుంది. ముగ్గులు, గొబ్బిళ్లు, భోగిమంటలు, కొత్త బట్టలు.. వీటన్నింటి మధ్య హరిదాసుల హరినామ సంకీర్తనలు, గంగిరెద్దుల గజ్జెల శబ్దాలు పండుగకు అసలైన ప్రాణం పోస్తాయి. కానీ.. హరిదాసులు, గంగిరెద్దుల వారు ఎందుకు సంక్రాంతి సమయంలోనే ఇంటింటికీ వస్తారు? ఈ సంప్రదాయాలు సంక్రాంతికే ఎందుకు కనిపిస్తాయి? హరిదాసులు, గంగిరెద్దుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసుకుందాం..
హరిదాసులు – విష్ణు స్వరూపం
నుదుటన మూడు నామాలు, తలపై అక్షయపాత్ర, చేతిలో చిడతలు, తంబూర పట్టుకుని 'హరి హరి' అంటూ ఊరంతా తిరుగుతుంటారు హరిదాసులు. వీరు కేవలం దానం కోసం వస్తున్నారని చాలా మంది భావిస్తారు. కానీ.. హరిదాసు అనేది శ్రీమహావిష్ణువు స్వరూపానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుల ఇళ్లకు వెళ్లి హరినామం పలుకుతూ ఆశీర్వచనం ఇవ్వడమే వారి ముఖ్య ఉద్దేశం. ఎవరినీ అడగరు, ఎవరైనా ఇస్తే మాత్రమే స్వీకరిస్తారు. వాళ్ల తలపై ఉండే గుమ్మడికాయ ఆకారపు పాత్ర.. భూమిని సూచిస్తుందని, శ్రీహరి భూమిని ఉద్ధరిస్తున్న సంకేతంగా భావిస్తారు. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా.. ఎక్కడ ఆగకుండా ముందుకు సాగుతూ ఉంటారు.

గంగిరెద్దు – నందీశ్వరుడి అవతారం
సంక్రాంతి సమయంలో అలంకరించిన గంగిరెద్దులు ఇంటి ముందుకు వచ్చాయంటే భక్తులకు అపార ఆనందం. వస్త్రాలతో కప్పి, అద్దాలు, గజ్జెలు, గంటలతో అలంకరించి, డోలు, బూర శబ్దాలతో నందీశ్వరుడిని ఇంటింటికి తీసుకువస్తారు కళాకారులు. బసవన్న అనేది సాక్షాత్తూ శివుని వాహనం నందీశ్వరుడిగా భావిస్తారు. ఆయన దీవెన ఉంటే ఏడాదంతా పాడిపంటలు పుష్కలంగా ఉంటాయని ప్రజల విశ్వాసం. అందుకే గంగిరెద్దుకు దండం పెట్టి, నైవేద్యం సమర్పించి గౌరవిస్తారు. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బిళ్లు పెడతారు. ఆ ముగ్గు ఉన్న ప్రదేశం ధర్మబద్ధమైన నేల అని నమ్మకం. అందుకే హరిదాసులు, గంగిరెద్దులు ఆ ముగ్గు మధ్యలో నిల్చుని దానం స్వీకరిస్తారు.. అంటే ధర్మస్థలంలో నిల్చుని భక్తులను ఆశీర్వదిస్తున్నారనే అర్థం.

దానం కాదు… ఆశీర్వాద స్వీకారం
మనమిచ్చేది కేవలం బియ్యం, వస్త్రాలు, ధనం మాత్రమే కాదు.. మన ఇంటికి వచ్చిన హరిహర స్వరూపాల నుంచి ఆశీర్వాదం పొందుతున్నామనే భావనే ముఖ్యమైనది. అందుకే సంప్రదాయం ప్రకారం, సంక్రాంతి సమయంలో హరిదాసును, గంగిరెద్దును ఖాళీగా పంపకూడదని అంటారు. ఇది పుణ్యకార్యం, శుభసూచకమని కూడా పెద్దలు చెబుతారు. ఈ ఆచారాలు కేవలం వినోదం కోసం కాదు.. మన సంస్కృతి, ఆధ్యాత్మికత, వ్యవసాయ జీవనశైలికి ప్రతీకలు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాలు సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News