రష్యా నుంచి ప్రియుడి కోసం భారత్కు..
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:53 PM
ప్రేమకు దేశాలు, సరిహద్దులు అడ్డుకావని మరోసారి నిరూపించే ఘటన బిహార్లో వెలుగుచూసింది. రష్యాలో పరిచయమైన ప్రియుడి కోసం ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి భారత్కు వచ్చింది. అంతేకాదు.. అతడి కుటుంబం చిన్న గుడిసెలో నివసిస్తున్నా, అతడితోనే జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ప్రేమకథ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: ప్రేమకు భాష, ప్రాంతం, దేశం అడ్డుకాదని మరోసారి నిరూపించే ఘటన బిహార్లోని భాగల్పూర్లో వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన రాహుల్ యాదవ్కు అక్కడ పరిచయమైన జూలీ అనే యువతి అతడితో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత రాహుల్ భారత్కు తిరిగొచ్చినా.. ఇద్దరి మధ్య బంధం కొనసాగింది.
దూరం పెరిగినా ప్రేమ తగ్గకపోవడంతో.. కలిసి జీవితాన్ని ప్రారంభించాలని ఈ జంట నిర్ణయించుకుంది. ఈ క్రమంలో జూలీ తన తల్లిదండ్రులతో కలిసి భాగల్పూర్లోని రాహుల్ ఇంటికి చేరుకుంది. విదేశానికి చెందిన యువతి తమ ప్రాంతానికి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా..ఈ ప్రేమకథ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
రాహుల్, జూలీ వివాహంపై ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల అనంతరం పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వీరి వివాహం నవంబర్లో జరగనుంది. పెళ్లి తర్వాత ఎక్కడ నివసించాలనే అంశంపైనా ఈ జంట మాట్లాడుకున్నట్లు సమాచారం. తమ కుటుంబం చిన్న గుడిసెలో నివసిస్తోందని రాహుల్ జూలీకి వివరించినప్పటికీ, అతడితో కలిసి అక్కడే జీవించేందుకు ఆమె అంగీకరించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక స్థితిగతుల కంటే తమ బంధానికే ప్రాధాన్యం ఇచ్చిన ఈ జంట నిర్ణయం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్లో కలకలం
Read Latest AP News And Telugu News