ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:30 PM
ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర కలకలం రేపింది. భూకంపం కారణంగా 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 200 మంది గాయపడినట్లు సమాచారం.
ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర కలకలం రేపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్టు బ్లూమ్‌బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. అనంతరం తీవ్రతను 7.8గా సవరించారు. భూకంపం కారణంగా 15 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 200 మంది గాయపడినట్లు సమాచారం. ఇది భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రీకృతమవడంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. భూకంపం సృష్టించిన బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూమి తీవ్రంగా కంపించడంతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ సమయంలో ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఓ పాఠశాల మైదానంలో పిల్లల కోసం ఏర్పాటు చేసిన భారీ షెడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. ముందే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
భూకంపం కారణంగా సముద్ర తీరప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాబోయే కొన్ని గంటల పాటు ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, పలావు, తైవాన్, పాపువా న్యూ గినియా దేశాల తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్ తీరంలో దాదాపు మూడు అడుగుల ఎత్తులో అలలు ముందుకు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇటు ఇండోనేషియా వాతావరణ సంస్థ కూడా బోర్నియో, సులవేసి ప్రాంతాల్లో ఏకంగా మూడు మీటర్ల ఎత్తు వరకూ సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ విపత్తుపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ తీవ్రంగా స్పందించారు. తీర ప్రాంతాల్లోని ప్రజలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన ఆదేశించారు. ఆస్తుల కంటే ప్రాణాలే అత్యంత విలువైనవని, ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు మిండనావో పరిధిలోని ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ మాటల్ని పట్టించుకోని ఇజ్రాయెల్!.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
నేడు సిద్ధాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి
Read Latest Telangana News And Telugu News