పెరూలో భారతీయుడిపై దుండగుల కాల్పులు.. భారీగా బంగారం దోపిడీ
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:00 PM
పెరూలోని కల్లావో ప్రాంతంలో కోస్టా వెర్డే సమీపంలో పట్టపగలు ముసుగు ధరించిన దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ భారతీయుడు, పెరూకు చెందిన మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: పెరూలోని కల్లావో ప్రాంతంలో కోస్టా వెర్డే సమీపంలో పట్టపగలు ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఓ భారతీయుడు, పెరూకు చెందిన మహిళ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో లా పెర్లా జిల్లాలోని శాంటా రోసా కొండ సమీపంలో బాధితులు నల్లటి ఎస్‌యూవీ జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో కొంతమంది ముసుగులు ధరించిన దుండగులు పలు వాహనాల్లో వచ్చి వారిని అడ్డుకున్నారు.
అనంతరం ఎస్‌యూవీపై 30 సార్లకు పైగా కాల్పులు జరిపి.. వాహనాన్ని ఢీకొట్టి డోర్లు బలవంతంగా తెరిచారు. ఎస్‌యూవీలో ఉన్న సంచులు, సూట్‌కేసులు తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే.. దుండగులు ఎత్తుకెళ్లిన సామాగ్రిలో బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు ఉన్నట్లు అనుమానిస్తున్నప్పటికీ, వాటి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పెరూవియన్ మీడియా ఎల్ కొమెర్సియోలో వెలుగులోకి వచ్చాయి.
ఇదిలా ఉంటే.. ఈ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగి ఉంటుందని కల్లావో పోలీస్ రీజియన్ అధిపతి జనరల్ ఓల్గర్ బెనావిడెస్ తెలిపారు. బాధితులను దుండగులు ముందుగానే గుర్తించి.. వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడగా.. డ్రైవర్ స్థానిక క్లినిక్‌లో చికిత్స పొందుతున్నారు. దుండగులు పారిపోతున్న సమయంలో కోస్టా వెర్డే దిగువ ప్రాంతంలో మొబైల్ ఫోన్లను విసిరేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. దాడికి ముందు నిందితుల మధ్య జరిగిన సంభాషణల వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ.. దోపిడీకి ఉపయోగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
ప్రముఖ విద్యావేత్త మంగాదేవి కన్నుమూత
ప్రతి 100 రోజులకు కొత్త రూపు.. అమరావతి నిర్మాణంపై లోకేశ్ వీడియో
Read Latest AP News And Telugu News