Tax Regime: వ్యక్తిగత ఆదాయపు పాత పన్ను vs కొత్త పన్ను విధానం.. చెల్లింపుదారులకు ఏది మంచిది..
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:55 PM
దేశంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రస్తుతం.. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ తమకు అనువైన ఏ విధానాన్ని కావాలంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటు కేంద్రం కల్పించింది. వీటిలో ఎవరికి ఏ విధానం మంచిది?
ఆంధ్రజ్యోతి, జనవరి 16: దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లించే వారికి ప్రస్తుతం రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పాత పన్ను విధానం (Old Tax Regime), మరొకటి కొత్త పన్ను విధానం (New Tax Regime). కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ఏ విధానాన్ని కావాలంటే దాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించింది.
పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు, రాయితీలు ఉన్నాయి. సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులకు మినహాయింపు, హోమ్ లోన్ వడ్డీపై సెక్షన్ 24(B) కింద రాయితీ, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం (80D), HRA, LTA వంటి ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ఎక్కువ పెట్టుబడులు చేసే వారు, లోన్లు తీసుకున్నవారికి ఈ విధానం సాధారణంగా లాభదాయకంగా ఉంటుంది.
కొత్త పన్ను విధానంను సులభమైన పన్ను వ్యవస్థగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో పన్ను శ్లాబులు తక్కువగా ఉండగా.. ఎక్కువ మినహాయింపులు, డిడక్షన్లు తొలగించారు. డాక్యుమెంటేషన్ తక్కువగా ఉండేలా ఈ విధానం రూపొందించారు. ముఖ్యంగా యువ ఉద్యోగులు, శాలరీ స్ట్రక్చర్ సింపుల్‌గా ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ట్యాక్స్ పేయర్స్‌కు ప్రతి ఆర్థిక సంవత్సరంలో పాత లేదా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. శాలరీ ఉద్యోగులు తమ ఎంపికను సంవత్సరంలో మార్చుకోవచ్చు. అయితే.. వ్యాపార ఆదాయం ఉన్నవారు ఒకసారి కొత్త విధానాన్ని ఎంచుకుంటే, కొన్ని షరతులతో మాత్రమే తిరిగి పాత విధానానికి మారే అవకాశం ఉంటుంది.
మొత్తానికి పెట్టుబడులు, రాయితీలు ఎక్కువగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని, సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ కోరుకునేవారు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మంచిదని నిపుణులు చెబుతుంటారు. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులను విశ్లేషించుకుని సరైన విధానాన్ని ఎంచుకోవాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం పాఠకులకు అవగాహన కోసమని గ్రహించాలి. మీకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వయంగా మీ ఆర్థిక నిఫుణుడిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
Read Latest Telangana News And Telugu News