నాందేడ్ హైవేపై కుప్పకూలిన ఫ్లైఓవర్.. భయంతో పరుగులు తీసిన జనం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:54 PM
నాందేడ్-లాతూర్ రహదారిపై విష్ణుపురి ఫ్లైఓవర్ భాగం కుప్పకూలి రోడ్డుపై పడింది. ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాందేడ్-లాతూర్ రహదారిపై విష్ణుపురి ఫ్లైఓవర్ భాగం కుప్పకూలి రోడ్డుపై పడింది. ప్రజలు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. శ్రీ గురుగోవింద్ సింగ్ జీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న విష్ణుపురి ఫ్లైఓవర్‌కు సంబంధించిన ఓ భారీ భాగం ఒక్కసారిగా కుప్పకూలి కింది రోడ్డుపై పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ ఆ ప్రదేశంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో ప్రాణనష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే.. అత్యంత కీలకమైన ఈ జాతీయ రహదారిపై వంతెన విభాగం పడిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
ఈ ఘోర ఉదంతం వెలుగుచూడగానే స్థానిక ప్రజలు, ప్రయాణికులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం ఇలా కూలిపోవడానికి నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపాలే కారణమని ఆరోపిస్తూ, దీనిపై తక్షణమే ఓ ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కూలిపోయిన వంతెన శిథిలాలను రోడ్డుపై నుంచి వీలైనంత త్వరగా తొలగించి రవాణా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, దెబ్బతిన్న విభాగానికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రమాదం కారణంగా ఈ మార్గంలో నిత్యం ప్రయాణించే వేలాది మందిలో భద్రతాపరమైన ఆందోళనలు మొదలయ్యాయి. వంతెన మిగిలిన భాగం ఎంతవరకు సురక్షితంగా ఉందో అధికారులు స్పష్టం చేయాలని, పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు నిర్వహించిన తర్వాతే ఇక్కడ రాకపోకలను అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గురుగ్రామ్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి
హుండీ నుంచి స్టాక్స్‌లోకి.. రాముడి సొమ్ముతో లాభాల వేట