Share News

నాగ్‌పూర్‌లో పార్కింగ్ గొడవ.. దుకాణదారుడికి బెదిరింపులు

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:05 PM

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వాహనం ఎక్కడ పార్క్ చేయాలనే అంశంపై ఓ స్థానిక వ్యక్తికి, దుకాణదారుడికి మధ్య మొదట చిన్నపాటి వాగ్వాదం జరిగింది..

నాగ్‌పూర్‌లో పార్కింగ్ గొడవ.. దుకాణదారుడికి బెదిరింపులు
Nagpur Parking Dispute

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వాహనం ఎక్కడ పార్క్ చేయాలనే అంశంపై ఓ స్థానిక వ్యక్తికి, దుకాణదారుడికి మధ్య మొదట చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే.. మాటామాటా పెరగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆగ్రహానికి గురైన స్థానిక వ్యక్తి.. తల్వార్ బయటకు తీసి, దుకాణదారుడిని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా చంపేస్తానంటూ హెచ్చరించినట్లు సమాచారం.

ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా పరిష్కరించుకోవాల్సిన పార్కింగ్ సమస్య కత్తి బయటకు తీసేంతవరకు వెళ్లడం పలువురిని ఆందోళనకు గురిచేస్తోంది.


ఇదిలా ఉంటే.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో కూడా పార్కింగ్ వివాదం.. ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. టెక్ మహీంద్రా మాజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పరమ్‌జిత్ ధన్‌ఖర్ తన మేనల్లుడి వివాహం కోసం సింగపూర్ నుంచి భారత్‌కు వచ్చారు. ఈ సమయంలో పొరుగువాడైన మోను శర్మతో పార్కింగ్ విషయంలో వివాదం తలెత్తింది. సమస్యపై మాట్లాడుకుందామని చెప్పి పరమ్‌జిత్‌ను మొదటి అంతస్తులోని ఫ్లాట్ నుంచి బయటకు పిలిచిన నిందితుడు.. అనంతరం ఆయనపై పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో పాటు కాల్పుల దృశ్యాలు కూడా కనిపించాయి. దీపావళికి రెండు రోజుల ముందు జరిగిన ఈ ఘటనలో పరమ్‌జిత్ ప్రాణాలు కోల్పోయారు.


ఇవీ చదవండి

నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు

Updated Date - Nov 14 , 2026 | 05:22 PM