ముంబైలో సౌండ్ లేకుండా హెడ్‌ఫోన్స్‌తో దుర్గమ్మ నిమజ్జనం.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 22 , 2026 | 10:38 AM
ముంబైలో దుర్గామాత నిమజ్జనోత్సవం సరికొత్త ట్రెండ్‌కు వేదికైంది. డీజే మోత లేదు.. భారీ స్పీకర్ల హోరు లేదు.. అయినా భక్తుల్లో ఉత్సాహం మాత్రం తగ్గలేదు.
ఇంటర్నెట్ డెస్క్: పండుగలంటేనే సందడి.. ఊరేగింపులంటే డీజే పాటలు, భారీ స్పీకర్ల హోరు గుర్తుకొస్తాయి. కాకపోతే.. డీజే సౌండ్స్ వల్ల శబ్దకాలుష్యం పెరిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఎలాంటి సౌండ్ లేకుండానే దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని నిర్వహిస్తూ ముంబైలో ఓ వినూత్న ట్రెండ్‌ను పరిచయం చేశారు. సాధారణ డీజేలకు భిన్నంగా ‘సైలెంట్ డీజే’ విధానంలో సాగిన ఈ ఊరేగింపులో భక్తులు.. యువత వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు ధరించి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. బయటకు ఎలాంటి భారీ సంగీత శబ్దాలు వినిపించకపోయినా.. హెడ్‌ఫోన్ల ద్వారా పాటలు వింటూ నిమజ్జన వేడుకను కొనసాగించారు. ఈ వినూత్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డీజే మోతకు బదులు హెడ్‌ఫోన్లు.. శబ్ద కాలుష్యానికి చెక్..
నిమజ్జన శోభాయాత్రల్లో భారీ స్పీకర్లు.. డీజే పాటల కారణంగా పరిసర ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు అధిక శబ్దంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సైలెంట్ డీజే విధానం ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ప్రత్యేక హెడ్‌ఫోన్ల ద్వారా మాత్రమే సంగీతం వినిపించేలా ఏర్పాటు చేయడంతో, వేడుకల్లో పాల్గొనేవారు పాటలను ఆస్వాదిస్తూనే బయట శబ్దాన్ని తగ్గించవచ్చు. పండుగ సంబరాలకు భారీ శబ్దాలే అవసరం లేదని చాటిచెప్పే ఈ ప్రయోగం పర్యావరణహిత వేడుకలపై చర్చకు దారితీస్తోంది. సంప్రదాయాలకు విఘాతం కలగకుండా.. ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ఉత్సవాలు నిర్వహించవచ్చనే సందేశాన్ని ఈ సైలెంట్ డీజే కార్యక్రమం అందిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు.. రెండు రోజుల్లో 1.69 లక్షల మంది దర్శనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News