Share News

సీజేపీకి మద్దతుగా ఆందోళన.. ఇలా కూడా చేస్తారా? వీడియో వైరల్

ABN , Publish Date - Jul 24 , 2026 | 03:39 PM

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇదే డిమాండ్‌తో పలువురు ఆందోళనకారులు సినిమా పాట పాడి.. శాంతియుతంగా తమ నిరసన తెలిపారు.

సీజేపీకి మద్దతుగా ఆందోళన.. ఇలా కూడా చేస్తారా? వీడియో వైరల్
Students peaceful protest In Mizoram

ఇంటర్నెట్ డెస్క్: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోపాటు విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) న్యూఢిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జులై 20వ తేదీన ఆ పార్టీ చలో పార్లమెంట్‌కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నగర వీధుల్లోకి భారీగా యువత తరలి వచ్చింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి.

అలాగే విద్యార్థులు రాళ్లు రువ్వడంతో పోలీసులు గాయపడ్డారు. దీంతో దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులు నేటికి కొనసాగుతున్నాయి. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. పోలీసుల సెలవులను కూడా పూర్తిగా రద్దు చేశారు.


ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ ఆందోళనలకు మద్దతుగా అదే తరహాలో నిరసనలు కొనసాగుతున్నాయి. కానీ ఓ చోట మాత్రం తమ నిరసనను శాంతియుతంగా తెలుపుతున్నారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. ఈశాన్య రాష్ట్రం మీజోరంలో వందలాది మంది నిరసనకారులు ఒకే చోట ఆందోళన చేపట్టారు. ఓ భవనం వద్ద ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగు‌చుక్ ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నా.. వారంతా గొడుగులు పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపారు.


అయితే వారంతా నినాదాలు చేయడం లేదు. 3 ఇడియట్స్ చిత్రంలోని ‘గివ్ మీ సమ్ సన్‌షైన్..’ అంటూ వారంతా కలిసి పాట పాడుతున్నారు. ఈ పాట పాడడం పూర్తికాగానే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో‌ను రేమ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


భారతదేశంలోని విద్యా వ్యవస్థపై చాలా చిత్రాలు వచ్చాయి. వాటిలో ఒకటి 3 ఇడియట్స్ అని గుర్తు చేస్తున్నారు. విద్యార్థుల భావోద్వేగాలతో ఈ చిత్రం ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. అందుకే నిరసనకారులు ఈ పాటను ఎంచుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో విద్యార్థుల చూపిన ఐక్యత, శాంతియుత నిరసనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. వేలాది మంది లైక్ చేశారు.

Updated Date - Jul 24 , 2026 | 03:54 PM