అమెరికాలో క్రూయిజ్ నౌకను ఢీకొట్టిన ట్యాంకర్.. షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Nov 14 , 2026 | 03:29 PM
అమెరికాలోని మిసిసిపీ నదిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఓర్లీన్స్ పోర్టులో లంగరు వేసి ఉన్న క్రూయిజ్ నౌకను ఓ ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 32 మంది గాయపడ్డారు..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని మిసిసిపీ నదిలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఓర్లీన్స్ పోర్టులో లంగరు వేసి ఉన్న నదీ విహార క్రూయిజ్ నౌకను ఓ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో నౌక ఒకవైపునకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రాణాలు కాపాడుకునేందుకు నౌక నుంచి నీళ్లలోకి దూకారు. ప్రమాద సమయంలో నౌకలో సుమారు 180 నుంచి 190 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనలో 32 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు న్యూ ఓర్లీన్స్ మేయర్ హెలెనా మోరెనో వెల్లడించారు. అందరి ఆచూకీ లభించిందని, ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రమాదం కారణంగా నౌకను ఖాళీ చేసిన ప్రయాణికులకు స్థానిక హోటళ్లలో వసతి కల్పించారు. నగర అధికారులు, అమెరికన్ రెడ్‌క్రాస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఇవీ చదవండి
నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు