ఉద్యోగిని కష్టానికి తగ్గ గుర్తింపు.. మేనేజర్ చేసిన పనికి ఫిదా!
ABN , Publish Date - Nov 20 , 2026 | 10:30 AM
పని వేళలు ముగిసినా.. సంస్థ కోసం అర్ధరాత్రి వరకు ఓ ఉద్యోగిని పనిచేయడంపై ఆ కంపెనీ మేనేజర్ స్పందించిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే..
ఇంటర్నెట్ డెస్క్: పని వేళలు ముగిసినా.. సంస్థ కోసం అర్ధరాత్రి వరకు ఓ ఉద్యోగిని పనిచేయడంపై ఆ కంపెనీ మేనేజర్ స్పందించిన విధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ధిమాహి జైన్ అనే ఉద్యోగిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పని వాతావరణం, టీమ్ లీడర్ వ్యవహరించాల్సిన తీరుపై చర్చకు దారితీసింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన ఓ సంస్థలో ధిమాహి జైన్ ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల ఆమెకు ఆ సంస్థ ఓ పనిని అప్పగించింది. సాధారణంగా ధిమాహి పని వేళలు రాత్రి 10.30 గంటలకే ముగుస్తాయి. అయితే ఆరోజు కంపెనీ ఇచ్చిన అత్యవసర టాస్క్ కోసం ఆమె మరింత సమయాన్ని కేటాయించారు. రాత్రి ఒంటి గంట వరకు కష్టపడి టాస్క్‌ను పూర్తి చేశారు.
సంస్థ కోసం ఇంత కష్టపడిన ధిమాహిని మేనేజర్ అభినందించారు. అయితే చాలామంది పైఉద్యోగుల మాదిరిగా ఆయన కేవలం మెచ్చుకుని ఊరుకోలేదు. పని వేళలు దాటినా విధులు నిర్వర్తించిన ఉద్యోగి శ్రమను గుర్తించి, తరువాతి రోజు ఆఫీసుకు ఆలస్యంగా రావాలని కోరారు. తన బాస్ వ్యవహరించిన తీరు ధిమాహికి ఎంతగానో నచ్చింది. ఇలాంటి మేనేజర్ కింద పని చేస్తున్నందుకు ఆమె చాలా సంతోషించారు. తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘పని వేళల కంటే ఎక్కువసేపు కష్టపడిన ఉద్యోగులకు చాలా మంది మేనేజర్లు కేవలం ఒక థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటారు. అయితే మా మేనేజర్ కృతజ్ఞతతో ఆగిపోలేదు. ఎక్కువసేపు పని చేసినందుకు, తరువాతి రోజు ఆలస్యంగా రావాలని నన్ను ఆయన కోరారు. ఇది చాలా చిన్న విషయమే కావచ్చు. కానీ ఇలా చేయడం వల్ల ఉద్యోగుల కష్టానికి విలువ, గౌరవమూ దొరుకుతాయి’ అని ధిమాహి పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి
జీటీఏ-6 కోసం రూ. 5 లక్షలతో ఏర్పాట్లు.. చివరి నిమిషంలో..
మోదీ జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు