ప్రేమించి పెళ్లికి నిరాకరణ.. మొబైల్ టవర్‌పై యువతి హైడ్రామా.. వీడియో వైరల్
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:52 PM
ప్రేమించానని వెంటపడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరకు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. ప్రియుడి మోసాన్ని నిరసిస్తూ ఏకంగా మొబైల్ టవర్ ఎక్కి హల్చల్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లాలో సోమవారం ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జటహా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పడరహీ చౌరస్తా వద్ద ఉన్న మొబైల్ టవర్‌పైకి ఓ యువతి ఎక్కింది. ఆమెను గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అసలు యువతి టవర్ ఎందుకు ఎక్కింది? ఆమెకు ఏం జరిగింది? అని ఆరా తీశారు. ఈ క్రమంలో తన ప్రేమ వ్యవహారాన్ని వివరిస్తూ.. ప్రియుడితో తాను చేసిన మొబైల్ చాటింగ్ స్క్రీన్షాట్ల ఫొటోకాపీలను గాల్లోకి విసిరింది. తనకు జరిగిన అన్యాయాన్ని అందరి దృష్టికి తీసుకురావడమే తన ఉద్దేశమని తెలిపింది.
యువతి తెలిపిన వివరాల ప్రకారం.. పక్క గ్రామానికి చెందిన తన సామాజిక వర్గానికే చెందిన ఓ యువకుడితో ఆమెకు ప్రేమ సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని యువకుడు హామీ ఇచ్చి తనతో సన్నిహితంగా మెలిగాడని యువతి ఆరోపించింది. అయితే.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ మొబైల్ టవర్ ఎక్కి నిరసనకు దిగింది. ఈ ఘటనతో చౌరస్తా వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువతి టవర్‌పై నుంచి కిందకు దిగుతుందా లేదా అన్న ఆందోళనతో స్థానికులు ఆమెను గమనిస్తూ ఉండిపోయారు. ప్రేమ పేరుతో మోసపోయానంటూ యువతి చేసిన ఈ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన
మద్యం స్కామ్ కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణ
Read Latest AP News And Telugu News