గుంతలో బైక్, రోడ్డుపై గాయాలతో జంట.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:23 PM
వర్షం పడినప్పుడు, వెలిసిన తర్వాత రహదారిపై వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. రోడ్లపై భారీ గుంతలు ఉంటాయి. వాటిలో నీరు చేరి ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ కూడా తెరిచి ఉంటాయి. కాబట్టి...
ఇంటర్నెట్ డెస్క్: వర్షం పడినప్పుడు, వెలిసిన తర్వాత రహదారిపై వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి. రోడ్లపై భారీ గుంతలు ఉంటాయి. వాటిలో నీరు చేరి ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ కూడా ఒక్కోసారి సరిగ్గా ఉండవు. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందుకు నిదర్శనమే ఈ వీడియోలోని ఘటన.
వర్షం పడిన సమయంలో ఓ జంట గుంతలో పడి తీవ్రంగా గాయపడింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలోని వివరాల ప్రకారం.. ఓవైపు వర్షం కురుస్తుండగా, మరోవైపు రహదారి నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో ఓ జంట వర్షంలో తడుచుకుంటూ బైక్‌పై వెళ్లింది.
సాధారణ వేగంతోనే బైక్‌ను నడుపుతూ వెళ్లాడా ద్విచక్రవాహనదారుడు. ఇంతలో రహదారిపై ఉన్న ఓ నీటి గుంటలో పడ్డారు. బైక్ చక్రం అందులో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో ఆ జంట కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి.
ఇంతలో స్థానికులు వారి వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో గాయపడిన జంటను పట్టించుకోకుండా అటుగా వచ్చిన పోలీస్ పీసీఆర్ వాహనం కూడా ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదం గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నాయకులు పౌరుల సమస్యలను పరిష్కరించడం కంటే తమ పదవులను కాపాడుకోవడానికే అధిక ఆసక్తి చూపుతున్నారని ఓ నెటిజన్ మండిపడ్డారు. దేశంలో అసలు పనిచేసే అధికార యంత్రాంగం ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. దాదాపు పుష్కర కాలం క్రితం బెంగళూరులో దాదాపు ఇలాంటి ఘటనే ఒకటి జరిగిందని మరో నెటిజన్ గుర్తుచేసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన జంటకు కనీసం ప్రథమ చికిత్స అందించకుండా.. ప్రమాద స్థలంలో నుంచి 112 అత్యవసర వాహనం వెళ్లి పోయిందని ఇంకో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తలకు హెల్మెట్ పెట్టుకోవాలని పోలీస్ శాఖ సూచనల మీద సూచనలు చేస్తోందని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా వర్షాకాలం కాబట్టి బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడంతో పాటు గుంతల రోడ్లపై అతిజాగ్రత్తగా వెళ్లాలని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.