Share News

శ్రీనగర్‌లో క్రికెటర్ వీరంగం.. ప్రేక్షకుడిపై పిడిగుద్దులు! వీడియో వైరల్

ABN , Publish Date - Oct 20 , 2026 | 03:28 PM

శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో రెడ్ ప్రీమియర్ లీగ్ సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాయల్ గుడ్‌విల్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కశ్మీరీ క్రికెటర్ జహంగీర్​ ఓ ప్రేక్షకుడిపై దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

శ్రీనగర్‌లో క్రికెటర్ వీరంగం.. ప్రేక్షకుడిపై పిడిగుద్దులు! వీడియో వైరల్
Red Premier League

ఇంటర్నెట్ డెస్క్: శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో రెడ్ ప్రీమియర్ లీగ్(RPL) సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాయల్ గుడ్‌విల్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కశ్మీరీ క్రికెటర్ జహంగీర్.. ఓ ప్రేక్షకుడిపై దాడి చేస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్లో జహంగీర్.. ఓ వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగి, అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ, నెట్టివేస్తున్నట్లుగా కనిపిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో అక్కడున్న పలువురు వ్యక్తులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీయడానికి ప్రయత్నించిన దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత క్రీడా మైదానంలో చోటుచేసుకున్న ఈ పరిణామం క్రీడాకారుల ప్రవర్తన, ప్రేక్షకుల భద్రత, క్రీడాస్ఫూర్తి వంటి అంశాలపై మరోసారి చర్చకు దారితీసింది. మైదానంలో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత సంయమనం పాటించడం, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం ఎంతో ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.


అసలు విషయానికి వస్తే.. సెమీఫైనల్‌లో అత్వాస్ ఇండియా XI జట్టు రాయల్ గుడ్‌విల్ సీసీపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం విజేత జట్టు మద్దతుదారులు తమ విజయాన్ని జరుపుకునేందుకు మైదానంలోకి ప్రవేశించడంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది. ఓడిపోయిన జట్టు ఆటగాళ్లు పెవిలియన్ వైపు వెళ్తున్న సమయంలో జహంగీర్​కు ఓ ప్రేక్షకుడికి మధ్య వాగ్వాదం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థానిక మీడియా సంస్థతో మాట్లాడిన జహంగీర్.. ప్రత్యర్థి జట్టు మద్దతుదారులు తనను దూషించారని, ముఖ్యంగా తన తల్లిని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్రంగా ఆవేశానికి గురయ్యానని పేర్కొన్నట్లు సమాచారం. ఆ సమయంలో తాను సంయమనం కోల్పోయానని అంగీకరిస్తూనే, దూషణలను సహించలేనని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం స్పష్టతకు రావాల్సి ఉంది.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 20 , 2026 | 05:31 PM