Share News

ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే..!

ABN , Publish Date - May 30 , 2026 | 03:06 PM

కార్పొరేట్ ఉద్యోగాల్లో అధిక పనిభారం, ఒత్తిడి కారణంగా ఓ మహిళ తన ఐటీ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో డ్రైవర్‌గా మారడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొమ్మిదేళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఆమె, ఇప్పుడు ఆటో నడుపుతూ నెలకు సుమారు రూ.60 వేల వరకు సంపాదిస్తుండటమే కాకుండా మానసిక ప్రశాంతతతో సంతోషంగా జీవిస్తున్నానని తెలిపింది.

ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ.. నెలకు ఎంత సంపాదిస్తుందంటే..!
IT Manager Quits Job

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది యువత మెరుగైన భవిష్యత్తు కోసం తమ స్వస్థలాలను వదిలి ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మహానగరాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే అధిక పనిభారం, నిరంతర ఒత్తిడి, నిద్రలేమి, కెరీర్‌లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం వంటి కారణాల వల్ల కొందరు కార్పొరేట్ ఉద్యోగాలను వదిలి తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారి, ఇప్పుడు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మహిళా ఆటో డ్రైవర్ కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నారు. మొదట ఆమెను సాధారణ ఆటో డ్రైవర్‌గా భావించినప్పటికీ, మాట్లాడిన తర్వాత ఆమె గతంలో ఐటీ రంగంలో మేనేజర్‌గా పనిచేసిందని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలిపారు.


ఆ మహిళ దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఐటీ మేనేజర్‌గా పనిచేసిందట. అయితే కార్పొరేట్ ప్రపంచంలోని నిరంతర ఒత్తిడి, పనిభారం కారణంగా ఉద్యోగ జీవితంపై విసుగు చెంది, చివరికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అనంతరం తనకు స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించే మార్గాన్ని ఎంచుకుని, ఆటోను కొనుగోలు చేసి నడపడం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడిన వ్యాపారవేత్త.. పురుషులు ఎక్కువగా నడిపే ఆటో డ్రైవింగ్ రంగంలో పనిచేయడం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించారు. ప్రస్తుతం తాను ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేస్తూ.. నెలకు సుమారు రూ.60,000 వరకూ సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, గత ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉందని, తన జీవితంపై పూర్తి సంతృప్తితో ఉన్నానని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

Updated Date - May 30 , 2026 | 03:50 PM