నలుగురు డిప్యూటీ సీఎంలకు డీకే విముఖత.. మంత్రివర్గంలో వీరికి ఛాన్స్
ABN , Publish Date - May 30 , 2026 | 02:53 PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న డీకే శివకుమార్ తన క్యాబినెట్‌లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనతో విభేదించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన నిర్ణయాన్ని ఆయన కేంద్ర అధిష్ఠానానికి తెలియజేశారు.
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్న డీకే శివకుమార్ (DK Shivakumar) తన క్యాబినెట్‌లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనతో విభేదించినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తన నిర్ణయాన్ని ఆయన కేంద్ర అధిష్ఠానానికి తెలియజేశారు. కర్ణాటక కాంగ్రెస్‌లో చాలామంది సీనియర్లు ఉన్నందున కొందరిని మాత్రమే ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడం వల్ల పార్టీ శ్రేణులో అసంతృప్తి తలెత్తవచ్చని పార్టీకి ఆయన వివరించినట్టు తెలుస్తోంది.
సీఎల్‌పీ సమావేశం
సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవడంతో కర్ణాటకలో అధికార పంపకాలకు సంబంధించిన ఒప్పందంపై చాలాకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడింది. జూన్ 3న డీకే శివకుమార్.. కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటు, పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై సీనియర్ నేతలతో పార్టీ అధిష్ఠానం సంప్రదింపులు కూడా సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ (సీఎల్‌పీ) సమావేశం శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎల్‌పీ నేత ఎన్నిక జరుగుతుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తుమకూరు నుంచి నేరుగా సీఎల్‌పీ సమావేశానికి రానున్నారు. ఇటీవలే కన్నుమూసిన మాజీ మంత్రి కె.వెంకటరమణప్పకు నివాళులర్పించేందుకు ఆయన తుమకూరు వెళ్లారు.
కొద్ది మందితోనే డీకే ప్రమాణస్వీకారం
జూన్ 3న డీకే శివకుమార్‌తో పాటూ కొద్ది మంది మంత్రులే ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం మధ్య సంప్రదింపుల అనంతరమే తదుపరి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీలో 32 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంటుంది.
పరిశీలనలో కీలక మంత్రులు
మంత్రివర్గం కూర్పుపై చర్చలను కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మరం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పలువురు సీనియర్ మంత్రులను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారిలో ఎంబీ పటేల్, జి.పరమేశ్వర, కేజీ జార్జి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కేబీ గౌడ, లక్ష్మీ హెబ్బాల్కర్, బి సురేష్, సంతోష్ లాడ్ పేర్లు ఉన్నాయి. అసెంబ్లీ స్పీకర్ పదవికి రేసులో సీనియర్ మంత్రులు హెచ్ఎం మునియప్ప, హెచ్‌కే పటేల్ ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం, శివకుమార్, సిద్ధరామయ్య మధ్య సంప్రదింపుల ఆధారంగానే మంత్రివర్గం తుది కూర్పు ఉంటుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా జూన్ 3న డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం..?
తమిళ స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత