Share News

గుజరాత్‌లో షాకింగ్ ఘటన.. కళ్ల ముందే కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి..

ABN , Publish Date - Oct 17 , 2026 | 03:47 PM

కొందరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.. ఇంకొందరు మొబైల్ ఫోన్లలో బిజీగా ఉన్నారు.. ఇంతలోనే ఊహించని ఘటన! ఒక్కసారిగా అక్కడికి వచ్చిన చిరుతపులి.. ఓ కుక్కపై దాడి చేసి, నోట కరుచుకుని క్షణాల్లో మాయమైంది.

గుజరాత్‌లో షాకింగ్ ఘటన.. కళ్ల ముందే కుక్కను ఎత్తుకెళ్లిన చిరుతపులి..
Gujarat Leopard Attack

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న ప్రేరణధామ్ ఆశ్రమం వెలుపల ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. జనం చూస్తుండగానే.. ఓ చిరుతపులి వేగంగా దూసుకొచ్చి కుక్కను నోట కరుచుకుని అడవిలోకి ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆశ్రమంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గిర్నార్ అడవికి సమీపంలో ఉన్న ఈ ఆశ్రమం వద్ద సాయంత్రం వేళ చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను.. ఆశ్రమ నిర్వాహకులను ఆందోళనకు గురిచేసింది.

ఆశ్రమ ప్రవేశ ద్వారం సమీపంలోని కార్యాలయం వద్దకు చిరుతపులి నెమ్మదిగా రావడం.. ఆ సమయంలో అక్కడే ఓ కుక్క తిరుగుతూ ఉండటం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అంతలోనే చిరుతపులి ఒక్కసారిగా కుక్కపై దాడి చేసి.. దాని మెడను నోటితో గట్టిగా పట్టుకుని క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అత్యంత ఆందోళన కలిగించిన అంశం ఏమిటంటే.. చిరుతపులి దాడి చేసిన ప్రదేశానికి సమీపంలోనే పలువురు వ్యక్తులు ఉండటం. ఓ బెంచీపై ముగ్గురు వ్యక్తులు మొబైల్ ఫోన్లు చూస్తూ కూర్చోగా, మరికొందరు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. క్షణాల్లో జరిగిన ఈ పరిణామం ఆశ్రమ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం ఎంతటి అప్రమత్తత అవసరమో మరోసారి గుర్తుచేసింది.


సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి ఘటన.. ఆశ్రమంలో ఆందోళన..

ఆశ్రమ సంరక్షకుల్లో ఒకరైన రాజ్‌భాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిరుతపులి కుక్కను ఎత్తుకెళ్లిన సమయంలో అక్కడున్నవారికి అసలు ఏం జరిగిందో తొలుత అర్థం కాలేదు. అనంతరం సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో చిరుతపులి ఆకస్మికంగా దాడి చేసిన విషయం స్పష్టమైంది. గిర్నార్ అడవికి సమీపంలో ప్రేరణధామ్ ఆశ్రమం ఉండటంతో ఈ ప్రాంతంలో సింహాలు.. చిరుతపులులు అప్పుడప్పుడు సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. అడవులకు సమీపంలో నివసించే ప్రజలు, ఆశ్రమాలకు వచ్చే భక్తులు, సందర్శకులు పరిసరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 17 , 2026 | 04:26 PM