అమెరికాలో చాయ్‌వాలాగా భారత ఐటీ ఉద్యోగి.. సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.!
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:16 PM
ఐటీలో ఉద్యోగం పోయిన ఓ వ్యక్తి టీ అమ్ముతూ జీవనం సాగించడం ఆరంభించాడు. అనతి కాలంలోనే అంతకంతకూ ఎదిగి ఇప్పుడు నెట్టింట ఓ సెన్సేషన్‌గా మారాడు. సగటున ప్రతి ఐటీ ఉద్యోగిని ఆలోచింపజేసే ఆ టెకీ గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...
ఐటీ ఉద్యోగం అంటే ప్రస్తుత కాలంలో అంత గ్యారంటీ లేనిది. ఏఐ టెక్నాలజీ యుగంలో జాబ్ అనేది దినదిన గండంగా మారింది. ఏ కంపెనీ ఎప్పుడు లేఆఫ్స్ ఇస్తుందో తెలియని పరిస్థితి. అమెరికా లాంటి దేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాలు పొందగలిగే భారతీయుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓవైపు వీసా ఆంక్షలు.. మరోవైపు కంపెనీలు అకస్మాత్తుగా ఉద్యోగులకు టాటా చెప్పేస్తుండటంతో టెకీ భవిష్యత్తు గాలిలో నీటి బుడగలా మారింది.
అచ్చం అదే తరహాలో కొలువు కోల్పోయిన ఓ ఐటీ ఉద్యోగి.. జీవితంలో వేరే మార్గాన్ని ఎంచుకుని అందులో అద్భుతంగా రాణిస్తున్నాడు. బిహార్‌లోని పట్నాకు చెందిన ప్రభాకర్ ప్రసాద్ అనే వ్యక్తి అమెరికాలో టెకీగా పనిచేసేవాడు. గతేడాది ఫిబ్రవరిలో ఆ కంపెనీ లేఆఫ్ ఇవ్వడంతో లాస్ ఏంజిల్స్‌లో ఓ చిన్న టీస్టాల్‌ను ప్రారంభించాడు. ఒక కప్పు టీని రూ.780గా విక్రయిస్తున్నాడు. ఒక్కసారిగా అతడి వ్యాపారం ఊపందుకోవడంతో లాభాలబాట పట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇప్పుడంతా అతణ్ని బిహార్ చాయ్‌వాలా, చాయ్‌గుయ్ అని పిలుస్తున్నారు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రభాకర్ ప్రసాద్.. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. చలికాలంలో కనీసం దుప్పట్లు కూడా కొనలేని పరిస్థితి. ఆ సమయంలో వెచ్చదనం కోసం పప్పు బస్తాలకింద నిద్రించాల్సి వచ్చేంది. తల్లిదండ్రుల నిరంతర పోరాటం, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ అతనికి ఎన్నో పాఠాలు నేర్పాయి. తండ్రి ఎన్నో వ్యాపార ప్రయత్నాలు చేసినప్పటికీ ఆర్థికంగా విజయం దక్కలేదు. అయితే.. ప్రభాకర్‌ను చదివేందుకు మాత్రం ఏనాడు వెనుకంజ వేయలేదు. కుమారుడు కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువులో చక్కగా రాణిస్తూ.. అటు ఆటల్లో, ఇటు పాటల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంతలో ఓ రోజు ప్రభాకర్ సోదరుడు కిడ్నాప్‌నకు గురవడంతో.. వారు బిహార్‌ను వీడి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వలస వెళ్లారు.
ఒక్కసారిగా మారిన పరిస్థితులు ప్రభాకర్‌ను వెంటాడాయి. కొత్త నగరంలో, కొత్త పాఠశాలలో ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోవడంతో బాగా ఇబ్బందిపడ్డాడు. తోటి విద్యార్థులంతా అతడి ఆంగ్ల ఉచ్ఛారణను చూసి నవ్వేవారు. అయినా అతను పట్టుదలతో చదివాడు. చివరికి ఐఐటీ పరీక్షలో విజయం సాధించాడు. ఆ తర్వాత 2008లో మొదటిసారి ఉద్యోగంలో చేరాడు. కానీ ఆ పనిలో అతడికి ఆనందం కరవైంది. శారీరక వ్యాయామం, జిమ్, మోడలింగ్.. ఇలాంటి చిన్న ఆసక్తులు అతడిలో ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. ముంబైలో మోడలింగ్ ప్రయత్నాలు, లాంగ్ క్యూలు, చిన్న ఫ్లాట్స్ ఇలా అన్నింటినీ ఓర్పుతో ఎదుర్కొన్నాడు.
ఆ తర్వాత అమెరికాకు వెళ్లి ఎంబీఏ చేద్దాం అనుకుని ఆ దిశగా ప్రయత్నాలు సాగించాడు ప్రభాకర్. అక్కడా ఎదురుదెబ్బలే. రెండుసార్లు వీసా రిజెక్ట్ అయింది. అయితే.. ఎట్టకేలకు 2014లో అమెరికాకు వెళ్లగలిగాడు. ఊహించినంత అందంగా అమెరికా ఉండదని తెలుసుకోవడానికి అతడికి ఎంతోకాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని పరంగా ఎన్నో ఇబ్బందులను ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పదేళ్ల పాటు అలాగే కాలం గడిపాడు. ఉద్యోగం మార్పు, నగరం మార్పు.. అందులో కూడా సంతోషం తక్కువ, బాధ ఎక్కువగా కనిపించేవి. అయితే 2025లో కృత్రిమ మేధస్సు(ఏఐ) అతణ్ని వెంటాడింది. దీంతో అతడు లేఫ్ వేటుకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఏమిచేయాలో తెలియక చాలా చోట్ల పనికోసం వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది.
ఆ సమయంలో చిన్నప్పుడు తన తల్లిదండ్రులు చేసే చక్కటి చాయ్‌వైపు ప్రభాకర్ దృష్టి మళ్లింది. తక్కువ పెట్టుబడితో, లాస్ ఏంజిల్స్‌లో భారతీయ శైలిలో ఓ టీస్టాల్ ప్రారంభించాడు. అతడు రుచికరంగా చేసిన చాయ్.. స్థానికులలో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో అతను ఊహించిన దానికంటే పెద్ద విజయాన్ని సాధించింది. కొన్ని నెలల కష్టాల తర్వాత అతడు ఈ రంగంలో మంచిపేరు సంపాదించుకున్నాడు. సంప్రదాయ బిహారీ గమ్‌చా ధరించి, చిరునవ్వుతో చాయ్ సర్వ్ చేస్తూ.. రీల్స్ పోస్ట్ చేసి ప్రేక్షకుల హృదయాలను తాకాడు. ఈ రీల్స్ అతణ్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అతను ఒక టీని 8 డాలర్లు(భారత కరెన్సీలో రూ.780)కు అమ్ముతున్నాడు. ఇది అతడికి చాలా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. అతను ఓ పేద కుటుంబంలో పుట్టి పెరిగానని, అనేక కార్పొరేట్ కంపెనీలలో పనిచేశానని, మంచి అనుభవాన్ని పొందానని చెప్పాడు. ఐటీలో పనిచేస్తున్నప్పటికీ.. టీస్టాల్ మాత్రం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని చెప్తున్నాడీ చాయ్‌గుయ్. ఉద్యోగం చేసేటప్పుడు తనకు చాలా డబ్బు ఉండేదని.. కానీ స్వేచ్ఛ ఉండేదికాదని, కానీ ఇప్పుడు తనకు కావల్సిన స్వేచ్ఛ, మనశ్శాంతి ఉందని చెప్పుకొచ్చాడీ చాయ్‌వాలా.
ఇవీ చదవండి:
మహిళకు పునర్జన్మ ఇచ్చిన రోడ్డుపై గుంత.. ఎవ్వరూ ఊహించని అద్భుతం ఇది..
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రం కీలక నిర్ణయం