భలే దొంగ.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు...
ABN , Publish Date - Apr 19 , 2026 | 01:50 PM
దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు, జిత్తులు ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఓ దొంగ ఇటీవల మధ్యప్రదేశ్‌లో పోలీసులకు తారసపడ్డాడు.
దొంగలు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు, జిత్తులు ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఓ దొంగ ఇటీవల మధ్యప్రదేశ్‌లో పోలీసులకు తారసపడ్డాడు. రైళ్లలో మహిళల గొలుసుల్ని దొంగిలించి పారిపోయే ఒక దొంగ... సమీపంలోని చెరువులోకి దూకాడు. ఒక తామరకాడతో చెరువు లోపల శ్వాస తీసుకుంటూ కొన్ని గంటలపాటు రైల్వే పోలీసులను నానా తిప్పలు పెట్టాడు.
మధ్యప్రదేశ్‌లోని సిహోరా రైల్వేస్టేషన్‌లో దొంగతనానికి పాల్పడిన ఒక దొంగను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అయితే చిటికెలో ఆ దొంగ తప్పించుకుని, ట్రాక్ మీదుగా పారిపోయి, పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. వాడిని వెంటాడుతూ వెళ్లిన పోలీసులు చెరువు ఒడ్డునే కాపు కాశారు. అయితే సుమారు ఐదు గంటల పాటు దొంగ చెరువులోనే ఉండటంతో ఆశ్చర్యపోయారు. ఎట్టకేలకు ఈతగాళ్లను రప్పించి, చెరువంతా గాలిస్తే... సదరు దొంగ తామరకాడ ఆధారంగా శ్వాస తీసుకుంటూ లోపలే దాక్కున్నాడని తెలిసి కంగుతిన్నారు.
బయటకు తీసుకొచ్చి పోలీసులు వారి స్టయిల్‌లో విచారిస్తే... రైలులోని ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన దొంగపై అప్పటికే వివిధ రాష్ట్రాల్లో రెండు డజన్లకు పైగా దొంగతనం, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. చెరువులో దాక్కుంటే పోలీసులు కాసేపు వెదికి వెళ్తారనుకున్నాడు. కానీ పోలీసులు ఓపికగా వేచి చూసి, పట్టుకుని... దొంగ తెలివికి విస్తుబోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అదే నిజమైతే.. మాకు పిల్లలుండేవారు
Read Latest Telangana News and National News