Share News

యావత్ దక్షిణ భారతానికి తామే సర్వాధికారులమని చాటిచెప్పే చోళ రాజముద్ర!

ABN , Publish Date - May 17 , 2026 | 03:47 PM

దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్టాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలో చూద్దాం..

యావత్ దక్షిణ భారతానికి తామే సర్వాధికారులమని చాటిచెప్పే  చోళ రాజముద్ర!
Symbols on Chola Royal Seal Explained

న్యూఢిల్లీ, మే 17: భారతీయ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో మరో చరిత్రాత్మక మైలురాయి నమోదైంది. దాదాపు 300 ఏళ్ల క్రితం దేశం దాటి వెళ్లిన 11వ శతాబ్దపు నాటి అత్యంత అరుదైన, ప్రతిష్ఠాత్మక చోళుల కాలం నాటి రాగి శాసనాలు (Chola-era Copper Plates) నెదర్లాండ్స్ నుంచి తిరిగి భారతదేశానికి చేరనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్న తరుణంలో ఈ అరుదైన శాసనాలను భారత్‌కు అధికారికంగా అప్పగించారు. హేగ్‌లో జరిగిన ఈ చరిత్రాత్మక అప్పగింతల కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టన్ పాల్గొన్నారు. అయితే, ఈ రాగి శాసనాలు పొందుపరిచిన వలయం మీదున్న రాజముద్రలోని చిహ్నాలు దేనికి సంకేతాలన్నది ఆసక్తికరం.

చోళ సామ్రాజ్య రాజముద్ర (Chola Royal Seal)విశేషాలు:

రాగి శాసనాలన్నింటినీ ఒకచోట కలిపి ఉంచే పెద్ద కాంస్య వలయం (Bronze Ring) పై భాగంలో రాజముద్రను చోళులు అమర్చారు. కేవలం ఒక అంగుళం పరిమాణంలో ఉంటుందని చెబుతున్న ఈ రాజముద్రలో చోళుల వైభవానికి, వారి అఖండ విజయాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన చిహ్నాలు దాగి ఉన్నాయి. చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం ఈ ముద్రలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఇవే:

Chola-Raja-Mudra.jpg


మూడు రాజవంశాల చిహ్నాలు (సార్వభౌమత్వానికి ప్రతీక)

ఈ ముద్ర మధ్యలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన ముగ్గురు గొప్ప పాలకుల (మూడు ప్రాచీన రాజవంశాల) చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. దీని అర్థం చోళులు మిగిలిన ఇద్దరు పాలకులపై విజయం సాధించి, వారిని తమ సామంతులుగా చేసుకున్నారని చెప్పడమే.

పులి (Tiger): ముద్రకు ఎడమవైపున గంభీరంగా కూర్చుని, నోరు తెరిచి ఉన్న జంతువు పులి. ఇది చోళ వంశపు సొంత అధికారిక చిహ్నం.

జంట చేపలు (Twin Fish): పులికి ఎదురుగా నిలువుగా ఉన్న రెండు చేపలు పాండ్య రాజుల చిహ్నం (మీన లాంఛనం).

విల్లు-అమ్ము (Bow and Arrow): పులి, చేపల తర్వాత నిలువుగా అమర్చిన విల్లు ఉంటుంది. ఇది చేర రాజుల(కేరళ ప్రాంతం) చిహ్నం.

అర్థం: చోళ చక్రవర్తి (ఇక్కడ రాజేంద్ర చోళుడు) చేర, పాండ్య రాజ్యాలను జయించి, యావత్ దక్షిణ భారత దేశానికి తానే సర్వాధికారి అని చాటిచెప్పడానికి ఈ మూడు చిహ్నాలను కలిపి తన ముద్రగా వాడుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు.

రాజ వంశ ఆభరణాలు, దైవత్వ చిహ్నాలు..

చిహ్నాలకు పైభాగంలో, ఇంకా చుట్టుపక్కల మరికొన్ని ఆకృతులు చోళ రాజముద్రలో కనిపిస్తాయి.

వింజామరలు: పులి, చేపలకు ఇరువైపులా రాజకుటుంబీకుల వైభవానికి ప్రతీకగా వాడే రెండు వింజామరలు చెక్కి ఉన్నాయి.

రాజఛత్రం (Royal Umbrella): ఈ చిహ్నాలన్నింటికీ సరిగ్గా పైభాగంలో ఒక తెల్లని గొడుగు (ఛత్రం) వంటి ఆకృతి ఉంటుంది. ఇది సార్వభౌమత్వానికి గుర్తు.

దీపస్తంభాలు: ముద్ర కింది భాగంలో కాంతికి, మంగళకరానికి సూచికగా రెండు చిన్న దీపస్తంభాలు లేదా మంగళ దీపాలు చెక్కారు.

సంస్కృత శ్లోకం (గ్రంథ లిపిలో శాసనం)

ఈ గుండ్రటి ముద్ర అంచు చుట్టూ (Border) వృత్తాకారంలో గ్రంథ లిపిలో ఒక సంస్కృత శ్లోకం చెక్కబడి ఉంది. చోళుల ప్రతి రాజముద్రపై దాదాపు ఇదే శ్లోకం కనిపిస్తుంది. దాని అర్థం ఏంటంటే.. 'భూమండలాన్ని మొత్తం జయించిన చోళ చక్రవర్తి ఆజ్ఞ ఇది. భవిష్యత్తులో వచ్చే రాజులందరూ ఈ శాసనాన్ని (దానాన్ని) శిరసావహించి కాపాడాలి. అలా కాపాడిన రాజుల కిరీటాలపై ఈ ఆజ్ఞ ఒక రత్నంలా ప్రకాశిస్తుంది.' అన్నది ఆ అక్షరాల సారాంశంగా చెబుతున్నారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే.. వెయ్యి సంవత్సరాల క్రితం ఈ రాగి రేకుల్లో రాసిన బౌద్ధులకు భూముల దాన శాసనానికి ఎలాంటి మార్పులు లేదా నకిలీలు సృష్టించకుండా ఉండేందుకు, నేరుగా 'చోళ చక్రవర్తి ఆమోదించిన అధికారిక జీవో' అని నిరూపించేందుకు వేసిన రాజముద్ర (Official Stamp)ఇదని చరిత్రకారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నారా దేవాన్ష్ యూట్యూబ్ చానల్ ‘డైనో డీట్స్’ ప్రారంభం.. స్పందించిన లోకేశ్

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్‌పై..

For More AP News And Telugu News

Updated Date - May 17 , 2026 | 04:24 PM