Share News

చాణక్య నీతి: ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే!

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:41 AM

ప్రతికూల వ్యక్తులు జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతారని చాణక్య నీతి వివరిస్తోంది. అందుకే ప్రతికూల వ్యక్తులకు వీలైనంత దూరం పాటించాలని సూచిస్తోంది.

చాణక్య నీతి: ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే!
Chanakya Niti

ఇంటర్నెట్ డెస్క్: సహవాసం చెడ్డవారిని మంచివారిగా, మంచివారిని చెడ్డవారిగా మారుస్తుందనే నానుడి వినే ఉంటారు. అలాగే చెడ్డవారితో సహవాసం చేయడం వల్ల మనకు మనశ్శాంతి దూరమవుతుందని చాణక్య నీతి చెబుతోంది. ప్రతికూల వ్యక్తులు జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతారని వివరిస్తోంది. అందుకే ప్రతికూల వ్యక్తులకు వీలైనంత దూరం పాటించాలని సూచిస్తోంది. ఎలాంటి వారికి దూరంగా ఉండాలంటే..?


నిత్యం ఫిర్యాదులు చేసే వ్యక్తులు

నిత్యం ఏడుస్తూ, ప్రతి విషయంపై ఫిర్యాదులు చేసే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. అటువంటి ప్రతికూల వ్యక్తులు చుట్టూ ఉంటే.. మీలోని సానుకూల శక్తి తగ్గిపోతుంది. వారి ఫిర్యాదులను రాత్రి, పగలు వింటూ ఉండడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, జీవితంలో శాంతి లోపిస్తుంది. అందుకే ఇలాంటి వారికి దూరంగా ఉండడం ఉత్తమమని చాణక్య నీతి బోధిస్తోంది.

అసూయపడే వ్యక్తులు

ఇతరుల విజయాలను, సంతోషాలను చూసి తట్టుకోలేని వారికి దూరంగా ఉండాలి. కొందరు బయటకు మధురంగా మాట్లాడినా లోపల అసూయతో రగిలిపోతారు. వీరు పక్కన ఉంటే మీకు ఇబ్బందులూ ఎదురవుతాయి. అందుకే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.


చీటికిమాటికి అబద్ధాలు చెప్పేవారు

చీటికిమాటికి అబద్ధాలు చెప్పేవారితో సాంగత్యం జీవిత శాంతిని నాశనం చేయగలదు. చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం వల్ల పలు సమస్యలు వస్తాయి. వారు మనల్ని మోసగించే అవకాశాలూ లేకపోలేదు. అలాంటి వారితో సహవాసం మంచిది కాదని చాణక్య నీతి వెల్లడించింది.

మూర్ఖులు, మొండివాళ్లు..

చాణక్య నీతి ప్రకారం మూర్ఖులు తప్పొప్పులకు మధ్య తేడాను గుర్తించలేరు. వీరు తమ మూర్ఖత్వంతో చుట్టూ ఉన్నవారి శాంతిని పాడుచేసే అవకాశం ఉంది. అలాగే మొండి వ్యక్తులు కూడా తమ చుట్టూ ఉన్నవారి ప్రశాంతతకు భంగం కలిగిస్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం.


చిన్న విషయాలకు కోపగించుకునే వ్యక్తులు

ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం చిన్న విషయాలకే కోపగించుకునే వ్యక్తి తనకే కాకుండా, తనకు కావాల్సిన వారికీ హాని చేస్తాడు. ఆగ్రహంలో కఠినంగా మాట్లాడి ఇతరులను బాధిస్తాడు. అటువంటి కోపిష్టి వ్యక్తులతో సహవాసం మంచిది కాదు.


ఇవీ చదవండి

అద్వైతం ఏం చెబుతోంది?

అనంతరూపాల అభయప్రదాయిని

Updated Date - Oct 11 , 2026 | 08:47 AM