Share News

అనంతరూపాల అభయప్రదాయిని

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:13 AM

దుర్గాదేవి సప్త మాతృకలను కన్న తల్లి. ముల్లోకాలకు మూలమైన తల్లి. ఆమె దయ అనంతమైనది. రూపాలూ అనంతమైనవే. మహర్షులు వాటిలో వెయ్యి రూపాలను ‘లలితా సహస్రనామావళి పేరుతో ఒక్క చోటికి చేర్చగలిగారు.

అనంతరూపాల అభయప్రదాయిని

దుర్గాదేవి సప్త మాతృకలను కన్న తల్లి. ముల్లోకాలకు మూలమైన తల్లి. ఆమె దయ అనంతమైనది. రూపాలూ అనంతమైనవే. మహర్షులు వాటిలో వెయ్యి రూపాలను ‘లలితా సహస్రనామావళి పేరుతో ఒక్క చోటికి చేర్చగలిగారు. వాటిలో ప్రధానమైన తొమ్మిది రూపాలను... నవదుర్గలుగా దేవీ నవరాత్రులలో ఆరాధిస్తారు. ఆ రూపాల గురించి శిల్ప, ఆగమ శాస్త్రాలు స్పష్టమైన ధ్యాన శ్లోకాలను అనుగ్రహించాయి. ఆ రూపాలను మదిలో స్థిరపరచుకొని ప్రార్థించినవారు అమ్మవారి అనుగ్రహానికి మరింత చేరువవుతారని పెద్దలు చెప్పారు. ఆ తొమ్మిది రూపాల గురించి, పురాణాలు పేర్కొన్న ప్రకారం వాటిని ఆరాధించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం:

శైలపుత్రి: నవరాత్రులలో మొదటిమొదటి రోజు పూజించే రూపం శైలపుత్రీదేవి. ఆమె అర్ధచంద్రుణ్ణి... అంటే నెలవంకను శిరసుపై ఆభరణంగా ధరించి, వృషభవాహనం మీద కూర్చొని ఉంటుంది. కుడి చేతిలో శూలాన్ని, ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. శైలపుత్రీదేవిని ఆరాధిస్తే మనసులో పేరుకుపోయిన అశాంతి తొలగిపోయి, అపారమైన ప్రశాంతత కలుగుతుంది. స్థిర జీవనం ఏర్పడుతుంది.

బ్రహ్మచారిణి: శరన్నవరాత్రులలో రెండో రోజున అమ్మవారిని బ్రహ్మచారిణిగా ఆరాధిస్తారు. కుడిచేతిలో జపమాలను, ఎడమ చేత కమండలాన్ని ధరించిన బ్రహ్మచారిణికి ప్రత్యేకించి ఏ వాహనమూ ఉండదు. కఠోరమైన తపస్సును ఆచరించడం వల్ల ఆమెను ‘తపశ్చారిణి’ అని కూడా పిలుస్తారు. ఆమెను ఆరాధిస్తే కఠినమైన సందర్భాలలో మనసు స్థిరపరచుకొని, సరైన నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి, యుక్తి కలుగుతాయి. ఆమె ఉపాసన వల్ల త్యాగ, వైరాగ్య భావనలు ఏర్పడతాయి.


చంద్రఘంటాదేవి: నవ దుర్గలలో మూడో రూపం చంద్రఘంటాదేవి. శరన్నవరాత్రులలో మూడో రోజు ఆరాధనలు అందుకొనే ఈ దేవి సింహవాహనంపై ఆసీనురాలై భక్తులను కటాక్షిస్తుంది. ఆమెది పది చేతులు కలిగిన మహోన్నత రూపం. కుడి చేతులలో పద్మం, బాణం, ధనస్సు, అభయముద్ర, జపమాల, ఎడమ చేతులలో త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలం కలిగి ఉంటుంది. ఆమె నుదుటిపై చంద్రుడు ఘంట ఆకారంలో అలంకృతుడై ఉంటాడు. పరమసాత్త్విక స్వరూపిణి అయిన ఆమెను పూజిస్తే మానసిక దారుఢ్యాన్ని పొందుతారు. వారి మనోభీష్టాలు త్వరగా నెరవేరుతాయి.

కూష్మాండ: శరన్నవరాత్రులలో నాలుగో రోజున దుర్గాదేవిని కూష్మాండా దేవిగా పూజిస్తారు. ఎనిమిది చేతులు కలిగిన ఆమెకు వాహనం సింహం. కుడి చేతుల్లో పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమ చేతుల్లో చక్రం, గద, జపమాల, అమృతకలశం ధరించి ఉంటుంది. ఎనిమిది భుజాలు ఉండడం వల్ల ఆమెను ‘అష్టభుజాదేవి’ అని కూడా పిలుస్తారు. ఆమెను ఉపాసిస్తే ఆయుష్షు, ఆరోగ్యం, యశస్సు వృద్ధి చెందుతాయి.

స్కందమాత: నవరాత్రులలో అయిదో రోజున స్కందమాతగా దుర్గాదేవిని ఆరాధిస్తారు. సింహాన్ని అధిరోహించిన ఈ దేవి నాలుగు చేతులతో ఉంటుంది. రెండు పరహస్తాలలో వికసిత పద్మాలను ధరించి, కుడి నిజ హస్తంతో కుమారస్వామిని పొదివి పట్టుకొని, ఎడమ చేత అభయముద్రతో భక్తులను కటాక్షిస్తుంది. స్కందుడికి తల్లి కాబట్టి ఆమెను ‘స్కందమాత’ అంటారు. ఆమెను ఉపాసిస్తే కోరికలు స్కందుడి అనుగ్రహం కూడా కలుగుతుందని దేవీ భాగవతం తదితర గ్రంథాలు చెబుతున్నాయి.


కాత్యాయని: నవ దుర్గలలో ఆరో రూపం కాత్యాయనీ దేవి. సింహవాహనంపై నాలుగు చేతులతో ఆమె దర్శనమిస్తుంది. కుడివైపు రెండు చేతులూ అభయముద్రలతో, ఎడమ చేతుల్లో ఒకదానితో ఖడ్గం, మరోదానితో పద్మం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. ఆమెను ఆరాధిస్తే భయాలు, శోకాలు, రోగాలు తొలగిపోతాయనీ, సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాలు పేర్కొన్నాయి.

కాళరాత్రి: నవ దుర్గా రూపాలలో ఏడవది కాళరాత్రీదేవి. ఆమె చీకటిలా నల్లటి దేహంతో, విరగబోసుకున్న జుట్టుతో... గార్ధభవాహనంపై భయంకరమైన రూపంలో ఉంటుంది. ఆమెకు నాలుగు చేతులు, కుడి చేతుల్లో అభయ, వరద ముద్రలతో, ఎడమ చేతులతో ఖడ్గం, లోహ కంటకం ధరించి కనిపిస్తుంది. అత్యంత భీకరంగా కనిపించే కాళరాత్రి... తనను ఆరాధించే భక్తులకు మాత్రం అభయంకరి. ఆమెను పూజించి, ఉపాసించేవారికి అంతఃశత్రువులను, బాహ్యమైన ఇక్కట్లను తొలగిస్తుంది.

మహాగౌరి: నవ దుర్గా రూపాలలో ఎనిమిదోది, అత్యంత శాంతమైనది మహాగౌరీ రూపం. తెల్లని వృషభాన్ని అధిరోహించిన ఆమె తెల్లని వస్త్రాలతో, నాలుగు చేతులతో ఉంటుంది. కుడి వైపు చేతుల్లో అభయముద్ర, త్రిశూలం, ఎడమవైపు చేతుల్లో వరదముద్ర, ఢమరుకంతో, ప్రకాశించే గౌరవర్ణంలో దర్శనమిస్తుంది. ఆమెను పూజిస్తే సకల పాపాలు నశిస్తాయి. కష్టాలు తొలగిపోయి, సుఖప్రదమైన జీవనం లభిస్తుంది.

సిద్ధిదాయిని: నవ దుర్గలలో ఆఖరి రూపం శ్రీసిద్ధిదాయిని. వికసించిన పద్మంపై కూర్చొని, వీరాసనంలో దర్శనమిచ్చే ఈ దేవి నాలుగు చేతులు కలిగి ఉంటుంది. పరహస్తాలలో శంఖ చక్రాలను, నిజ హస్తాలలో గదను, కమండలాన్ని ధరిస్తుంది. ఆమెను ఆరాధించిన భక్తుల కోరికలు నెరవేరుతాయని, మానసికంగా ప్రశాంతత, సంతృప్తి చోటు చేసుకుంటాయనీ పురాణాలు చెబుతున్నాయి.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

Updated Date - Oct 09 , 2026 | 01:13 AM