అద్వైతం ఏం చెబుతోంది?
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:04 AM
‘అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’ అనే ప్రశ్నలు తరచూ తలెత్తుతూ ఉంటాయి.
‘అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటి? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’ అనే ప్రశ్నలు తరచూ తలెత్తుతూ ఉంటాయి.
ఆది శంకరులను అర్థం చేసుకోకుండా అద్వైతం గురించి చర్చించడం అంటే... సముద్రాన్ని చూడకుండా దాని లోతు గురించి ప్రసంగించడం లాంటిది. ఇంతకీ అద్వైతం ఏం చెబుతోంది?
సమస్యలు జీవితంలో ఒక భాగమనీ, అవే మొత్తం జీవితం కాదనీ అద్వైత వేదాంతం మనకు బోధిస్తుంది. మనల్ని మనం బలహీనులుగా భావించుకోకూడదు. మన ఆధ్యాత్మిక బలం మీద విశ్వాసం కలిగి ఉండాలి. సరైన పనులు చేయాలి, ఫలితాల గురించి బెంగ పడకూడదు. ఓపికతో, అవగాహనతో, సమతుల్యతతో మెలగాలి. ఆర్థికంగా, మానసికంగా పురోగతి కోసం నిరంతరం కృషి చేయాలి, కొత్త అవకాశాలను అన్వేషించాలి. భక్తి, ధ్యానం, సత్సంగాల ద్వారా మనసును నిలకడగా ఉంచుకోవాలి. ఈ సూత్రాలను పాటిస్తే ఎవరైనా తమ జీవితంలో కష్టాలను అధిగమించగలరు, విజయాన్ని సాధించగలరు. అద్వైత సిద్ధాంతం జీవితంలోని సత్యాలను అర్థం చేసుకొని, కష్టాలను అధిగమించడానికి పరిష్కారాలను అందించే ఒక లోతైన, ఆచరణాత్మకమైన మార్గదర్శి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ కష్టాలు, ఆరోగ్య సమస్యలు లాంటి సమస్యలు జీవితంలో హటాత్తుగా తలెత్ప్తినప్పుడు... ఆ పరిస్థితిని ప్రశాంతంగా, సంయమనంతో, జ్ఞానంతో ఎదుర్కొనేలా అద్వైత వేదాంతం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ సూత్రాలేమిటో తెలుసుకుందాం.
ప్రతి మనిషికీ లోపల ‘ఆత్మ’ అనే శక్తి ఉంటుందని అద్వైత వేదాంతం మనకు బోధిస్తుంది. ఈ ఆత్మ నాశనం లేనిది. మీరు మీ పరిస్థితులకన్నా గొప్పవారని అర్థం చేసుకోండి. సమస్యలు తాత్కాలికం కానీ మీ అంతర్గత శక్తి శాశ్వతం. నిర్ణయాలను తీసుకొనేటప్పుడు విచక్షణను ఉపయోగించండి. ఏ సమస్యలు నిజంగా ముఖ్యమైనవో, ఏవి కేవలం మీ మనసు తాలూకు భ్రమలో గ్రహించండి. నిరాశను, భయాన్ని నివారించుకోవడానికి యోగా, ధ్యానం లేదా సానుకూల ఆలోచనలు చేయడం ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి.
ఈ లోకం మాయ అని, అది ఒక రకమైన భ్రమ అని అద్వైత సిద్ధాంతం చెబుతుంది మనం సమస్యలుగా పరిగణించేవి కాలక్రమేణా సమసిపోతాయి. అదే విధంగా, ఆనందం, విచారం, లాభం, నష్టం, విజయం, వైఫల్యం కూడా శాశ్వతం కాదు. ఒక సమస్య తలెత్తినప్పుడు ‘ఈ సమస్య శాశ్వతమైనదా?’ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి. చాలా సమస్యలు కాలంతో పరిష్కారమవుతాయి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎక్కువ ఒత్తిడి పడకుండా పరిష్కారాలను వెతకండి. ‘ఈ సమస్య కూడా దాటిపోతుంది’ అనే ఆలోచనాధోరణిని అలవరచుకోండి.
వైరాగ్యం అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదు, ప్రాపంచికమైన వాటిలో కొనసాగుతూ... వాటిలో చిక్కుకుపోకుండా ఉండడం. ఒక సమస్య ఎదురైతే, దాన్ని తీవ్రంగా పరిగణించండి, కానీ మీ మనశ్శాంతిని కోల్పోయేటంత ఎక్కువగా దాని మీద దృష్టి కేంద్రీకరించకండి. అతిగా ఆందోళన పడకండి. ఎందుకంటే ఆందోళన పరిష్కారాలను అందించదు. మానసికమైన అలసటను పెంచుతుంది. జీవితంలో సమతుల్యతను సృష్టించుకోండి. ఆర్థిక విషయాలు, కుటుంబం, మానసిక స్థిరత్వం... ఇలా ప్రతి దానికీ తగినంత సమయం కేటాయించండి. డబ్బు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు... దేనితోను అతిగా అనుబంధాన్ని పెంచుకోకండి.
అద్వైత వేదాంతం ప్రకారం... సహనం ఒక శక్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ హడావిడిగా నిర్ణయాలు తీసుకోవద్దు. సక్రమమైన ఆలోచనలతో, సరైన వ్యక్తులతో మీరు అనుబంధం పెంచుకుంటే సానుకూలమైన శక్తి లభిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తిని పెంచుకోవడానికి భగవద్గీత, ఉపనిషత్తులు లేదా సానుకూలమైన ఆలోచనలు కలిగించే పుస్తకాలు చదవండి. ప్రతికూలమైన మాటలు మాట్లాడేవాళ్ళతో కాకుండా మీకు స్ఫూర్తి కలిగించే వ్యక్తులతో సాంగత్యం చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం చేయండి.
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా... నీ కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మాత్రమే నీకు ఉంది. ఫలితాల గురించి చింతించకు’ అని భగవద్గీత చెప్పింది. ఒకేసారి సమస్యలు మీద పడినప్పుడు... వ్యక్తులు తరచుగా భయపడిపోతారు లేదా నిష్ర్కియులుగా మారిపోతారు. ఓపికగా సరైన పనిని కొనసాగించడమే విజయానికి కీలకమైన సూత్రమని వేదాంతం మనకు బోధిస్తోంది. ప్రతికూలమైన ఆలోచనల్లో చిక్కుకోవద్దు, క్రమంగా పరిష్కారాల కోసం వెతకండి. మీ చర్యల మీద దృష్టి కేంద్రీకరించండి. అయితే, ఫలితాల గురించి ఆందోళనలో మునిగిపోకండి. ఏదైనా పనిని చేపట్టినప్పుడు దానివల్ల గరిష్ట ప్రయోజనాలను పొందడానికి కృషి చేయండి, కానీ ఫలితాలు రావడానికి సమయం పడుతుందని గుర్తుంచుకోండి.