Police Rules: ఆ జంటలను పోలీసులు అరెస్ట్ చేయొచ్చా.. చట్టం ఏం చెబుతోందంటే?
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:56 PM
ఒకే హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయవచ్చా.. ఎలాంటి సందర్భంలో వారిని అదుపులోకి తీసుకోవచ్చు.. వాటికి సంబంధించిన నియమ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఓసారి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో కొన్ని జంటలు హోటళ్లలో బస చేయడం, ఏకాంతంగా గడపడం సర్వ సాధారణమైపోయింది. కొందరు ప్రయాణంలో భాగంగా.. మరికొందరు పనుల నిమిత్తం సేదతీరేందుకు ఇలా హోటళ్లను బుక్ చేసుకుంటారు. దీనికి అవసరమైన ఐడీని హోటల్ యాజమాన్యానికి అందించి చెక్-ఇన్ చేస్తారు. ఈ సందర్భంలో పోలీసులు అకస్మాత్తుగా హోటల్‌కు వస్తే ఏం జరుగుతుందోనని చాలా జంటలు భయపడుతుంటాయి. ఇలాంటి కేసులు ఇటీవల సోషల్ మీడియాలో వైరలైన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అలాంటి సమయంలో పోలీసులు.. జంటలను బెదిరించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం తగదు. చట్టం ఇంకా ఏం చెబుతుందంటే.?
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో ఒక హోటల్‌లో బస చేసేందుకు సంబంధిత గుర్తింపు కార్డుతో గదిని బుక్ చేసుకోవచ్చు. వారు అవివాహితులు అయినా పోలీసులు వారిని అరెస్ట్ చేయకూడదు. హోటల్ గదిలో కలిసి ఉండటం నేరం కాదు. ఏవైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలు, లైంగిక వేధింపులకు పాల్పడటం లేదా మైనర్ సంబంధిత కేసు ఉన్న సందర్భంలో మాత్రమే పోలీసులు చర్యలకు ఉపక్రమించవచ్చు.
ఇలాంటి సందర్భాల్లో చాలామంది తమ తప్పు లేకపోయినా ఆందోళన చెందుతుంటారు. సరైన కారణం లేకుండా పోలీసులు గదిలోకి చొరబడి బెదిరించకూడదు, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించరాదు. ఇటీవల తరచూ కొన్ని జంటలపై కేసు పెడతామని, నిర్బంధిస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటి గురించి నిజానిజాలు తెలుసుకోవాలి.
పోలీసులు హోటల్‌కు వచ్చిన సమయంలో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. వారు మీపై ఏ కారణంగా చర్యలు తీసుకొంటున్నారో ప్రశ్నించాలి. వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని భావిస్తే.. ఏ సెక్షన్ కింద చర్యలు చేపడుతున్నారో లిఖితపూర్వకంగా కోరవచ్చు. ఆ సందర్భంలో పోలీసుల సంభాషణను వీడియో కూడా తీయవచ్చు. ఇది పూర్తిగా చట్టబద్ధమైనదని గమనించాలి.
అవసరమైతే.. పోలీస్ కంట్రోల్ రూమ్(PCR)కు కాల్ చేయాలి. ఫిర్యాదు చేసేందుకు ఓ సీనియర్ అధికారి నంబర్ తీసుకోవాలి. మీ గుర్తింపు వివరాలను చూపేందుకు ఏ మాత్రం నిరాకరించకూడదు. అలాగని దురుసుగానూ ప్రవర్తించవద్దు. కొన్నిసార్లు పోలీసులు తల్లిదండ్రులను పిలుస్తామని బెదిరిస్తారు. ఇద్దరికీ 18 ఏళ్లు నిండి ఉంటే.. పోలీసులకు తల్లిదండ్రులకు కాల్ చేసే హక్కు లేదు. మీరు పెద్దలను, సొంత పరిస్థితులను అవగాహన చేసుకోగలరని వారికి స్పష్టంగా వివరించవచ్చు.
ఇవీ చదవండి:
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే అరెస్ట్..
గ్రోక్ అసభ్య కంటెంట్ ఎఫెక్ట్.. 600 అకౌంట్లు డిలీట్..