అర్ధరాత్రి మహిళ ఒంటరి ప్రయాణం.. ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:12 AM
బెంగళూరులో తెల్లవారుజామున ఒక మహిళా కంటెంట్ క్రియేటర్‌కు ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మగవాళ్ళందరూ ఒకేలా ఉండరు’ అనే సందేశంతో ఉన్న ఈ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో ఇటీవల ఓ యువతికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ అయిన ఐశ్వర్య కల్పర్జునన్ అనే యువతి.. ఇటీవల తెల్లవారుజామున 3 గంటల సమయంలో బెంగళూరు విమానాశ్రయం నుంచి.. నగరం ఒక బస్ స్టాఫ్ సమీపంలో దిగింది. అక్కడి నుంచి ఆమె ఇంటికి వెళ్లడానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. రైడ్-హెయిలింగ్ యాప్స్, బైక్ ట్యాక్సీల ద్వారా ఆమె చాలాసార్లు బుక్ చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ, దూరం తక్కువగా ఉండటంతో ఏ డ్రైవరూ ఆమె అభ్యర్థనను అంగీకరించలేదు. పరిచయం లేని ప్రాంతం, పైగా కటిక చీకటి.. బస్ స్టాప్‌లో ఒంటరిగా నిలబడి ఉన్న ఆమెలో క్రమంగా భయం మొదలైంది. ఆందోళనలో ఉన్న ఐశ్వర్య వద్దకు ఒక ఆటో డ్రైవర్ వచ్చారు. సాధారణంగా ఇలాంటి సమయాల్లో కొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లేదా అధిక ధరలు డిమాండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.
ఐశ్వర్య కల్పర్జునన్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆ డ్రైవర్.. ఆమెను సురక్షితంగా ఇంటి దగ్గర సురక్షితంగా దింపాడు. ఐశ్వర్య అతనికి డబ్బులు ఇవ్వబోగా.. ఆ డ్రైవర్ కేవలం రూ.40 మాత్రమే తీసుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒంటరి మహిళను సురక్షితంగా చేర్చడమే బాధ్యతగా భావించిన అతని తీరు ఐశ్వర్యను ఆశ్చర్య పరిచింది. ఈ విషయాన్ని ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘ప్రతి పురుషుడూ ఒకేలా ఉండడు, సమాజంలో మంచి మనసున్న వారు కూడా ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ ఆటో డ్రైవర్ నిజాయితీని, మానవత్వాన్ని కొనియాడుతున్నారు. ‘డబ్బులు సంపాదించడం ముఖ్యం కాదని, ఎదుటివారి కష్టంలో తోడుండటమే గొప్ప విషయం’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్‌లో ‘పౌరస్మృతి’ అమలు చేస్తాం
తమిళనాట.. హోరా హోరీగా ఎన్నికల ప్రచారం