బెంగాల్‌లో ‘పౌరస్మృతి’ అమలు చేస్తాం
ABN , Publish Date - Apr 12 , 2026 | 03:44 AM
పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బెంగాలీలను రాష్ట్రంలో మైనారిటీలుగా మారనీయబోమని చెప్పారు.
రాష్ట్రంలో బెంగాలీలను మైనారిటీలుగా మారనీయం
చొరబాటుదార్లు దేశాన్ని వీడాల్సిందే
సీఏఏ అమలు వేగవంతం: మోదీ
జంగీపూర్/కట్వా, ఏప్రిల్ 11: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రాగానే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. బెంగాలీలను రాష్ట్రంలో మైనారిటీలుగా మారనీయబోమని చెప్పారు. శనివారం పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా జంగీపూర్, పూర్బ బర్దమాన్ జిల్లా కట్వా పట్టణాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమబెంగాల్ అస్తిత్వం, భవితవ్యాలను కాపాడుకునే యుద్ధంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఆయన అభివర్ణించారు. బెంగాల్‌లో బుజ్జగింపు రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు యూసీసీని అమలు చేయాలని నిర్ణయించామన్నారు. మార్పునకు బెంగాల్ సిద్ధమైందన్నారు. ‘బెంగాల్ ప్రజలు మార్పు కోసం సంకల్పించినప్పుడు, దాన్ని సవాలు చేసేవారెవరైనా మట్టి కరవాల్సిందేనని చరిత్ర చెబుతోంది. బ్రిటిష్ పాలకుల నుంచి కాంగ్రెస్, లెఫ్ట్ వరకు అదే జరిగింది. ఇప్పుడు టీఎంసీ వంతు వచ్చింది’ అని మోదీ అన్నారు. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన హింసను మోదీ ప్రస్తావిస్తూ... హింసకు కారణమైనవారిని టీఎంసీ కాపాడుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామని టీఎంసీకి అర్థమైందని, అందుకే ఏఐ వీడియోలను సర్క్యులేట్ చేస్తోందని విమర్శించారు. లెఫ్ట్‌ఫ్రంట్ పాలనలో చూసిన బెదిరింపు, వసూళ్ల రాజకీయాలనే టీఎంసీ కూడా కొనసాగిస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో అత్యాచారం, హత్య కేసును ప్రస్తావిస్తూ.. టీఎంసీ ప్రభుత్వం ఎలా నిందితుడికి అండగా నిలిచిందో ప్రజలు మర్చిపోలేదన్నారు.
శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం..
బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. మటువా, నామసుద్ర, తదితర కులాలకు చెందిన శరణార్థులకు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద పౌరసత్వం కల్పించే చర్యలు వేగవంతం చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ వల్ల గంపగుత్తగా తమ ఓట్లు గల్లంతయ్యాయని మటువా, నామసుద్ర కులస్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మోదీ ఈ హామీ ఇచ్చారు. శరణార్థుల భవితవ్యాన్ని కాంగ్రెస్, టీఎంసీలు కాపాడలేవని.. రాజ్యాంగం, సీఏఏ మాత్రమే కాపాడగలవని మోదీ తేల్చిచెప్పారు. ‘మటువా, నామసుద్ర కులస్థులు టీఎంసీ నేతల దయతో ఇక్కడ శరణార్థులుగా బతకడం లేదు. వారికి రాజ్యాంగం రక్షణ కల్పిస్తోంది’ అన్నారు. అయితే, చొరబాటుదారులు మాత్రం పెట్టెబేడ సర్దుకొన్ని వెళ్లిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. చొరబాటుదారులు దేశాన్ని వీడాల్సిన సమయం ఆసన్నమైందని, ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికా్‌సతోపాటు సబ్‌కా హిసాబ్ కూడా తేలుస్తాం’ అని అన్నారు.