Share News

తమిళనాట.. నువ్వా-నేనా!

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:46 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. 234 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది.

తమిళనాట.. నువ్వా-నేనా!

  • హోరా హోరీగా ఎన్నికల ప్రచారం

  • ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్‌

(చెన్నై-ఆంధ్రజ్యోతి)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. 234 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో ఈ నెల 23న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. అధికార డీఎంకే సారథ్యంలోని కూటమి వరుసగా రెండోసారి విజయం సాధించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈసారైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి పట్టుదలతో ప్రయత్నిస్తోంది. ఇక, ఒంటరిగా బరిలోకి దిగిన సినీ నటుడు ‘దళపతి’ విజయ్‌ సారథ్యంలోని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) తీవ్రంగా శ్రమిస్తోంది. మరోవైపు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ స్థాపించిన ‘ఆలిండియా పురచ్చి తలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఐపీటీఎంఎంకే), పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ వర్గం, సినీ దర్శకుడు సీమాన్‌ స్థాపించిన ‘నామ్‌ తమిళర్‌ కట్చి’(ఎన్‌టీకే) తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ముఖ్యంగా తొలి రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ, విజయ్‌ నేతృత్వంలోని టీవీకే చీల్చే ఓట్లపైనే డీఎంకే-అన్నాడీఎంకే కూటముల జయాపజయాలు ఆధారపడి ఉంటాయని విశ్లేషిస్తున్నాయి.

ఎన్ని సీట్లలో ఏ పార్టీ?

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో 164 స్థానాల్లో అధికార డీఎంకే పోటీకి దిగింది. మిగిలిన స్థానాలను ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి పార్టీలకు కేటాయించింది. ఇందులో కాంగ్రెస్కు 28 స్థానాలు ఉన్నాయి. ఇక ‘ఎన్‌డీఏ’ కూటమికి నేతృత్వం వహిస్తున్న అన్నాడీఎంకే.. 167 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన సీట్లలో బీజేపీకి 27 స్థానాలను కేటాయించింది. విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ మొత్తం 234 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే సంక్షేమాన్ని, తమిళ అస్తిత్వాన్ని ప్రధాన అస్త్రాలుగా చేసుకుంది. మాజీ సీఎం, అన్నాడీఎంకేలో సుదీర్ఘకాలం పనిచేసిన ఓ. పన్నీర్‌సెల్వం(ఓపీఎస్‌) ఎన్నికలకు ముందు డీఎంకేలో చేరడం కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.


అన్నాడీఎంకేకు పళని ‘ఇమేజే’

అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకునేందుకు అన్నాడీఎంకే తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) అన్నీ తానై పార్టీని, కూటమిని నడుపుతున్నారు. ఇప్పుడు ఆయన ఇమేజ్‌పైనే కూటమి భవితవ్యం ఆధారపడిందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే, తమిళనాట వివిధ ప్రైవేటు సంస్థలు జరిపిన సర్వేల్లో అధికార డీఎంకేదే ఈసారి కూడా పైచేయిగా కనిపిస్తోంది. ‘కేకే సర్వేస్‌’ అంచనా ప్రకారం డీఎంకే 41.5 శాతం ఓట్లతో మళ్లీ అధికారం సాధించనుండగా, అన్నాడీఎంకే 36.2 శాతం,టీవీకే 13.6 శాతం ఓట్లను సాధించనున్నాయి.

చీలిక ఓట్లపై.. టీవీకే

రెండేళ్ల క్రితం పురుడు పోసుకున్న విజయ్‌ నేతృత్వంలోని టీవీకే కీలకంగా మారనుందన్న అంచనాలున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకేల జయాపజయాలను ఈ పార్టీ నిర్దేశించే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే టీవీకే క్షేత్రస్థాయిలో బలోపేతంకాలేదు. ఓటర్లను బూత్‌ వరకు తీసుకురాగలిగే క్యాడర్‌ లేకపోవడం ఆ పార్టీకి పెద్ద మైన్‌సగా మారింది. విజయ్‌కు జై కొట్టేవారే తప్ప, బూత్‌స్థాయి మేనేజ్‌మెంట్‌ చేయగలిగిన నేతలు పార్టీలో కనిపించడం లేదు. కానీ, విజయ్‌ ప్రభావంతో పార్టీకి గణనీయ మైన ఓట్లు వస్తాయని, ఆ పార్టీ చీల్చే ఓట్ల మీదనే డీఎంకే-అన్నాడీఎంకేల జయాపజయాలుఆధారపడి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 03:46 AM