మలుపు తిప్పుతుండగా ఘోరం.. నేరుగా ఇనుప చువ్వలపై పడి..
ABN , Publish Date - Jul 02 , 2026 | 04:22 PM
హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం సమీపంలో బుధవారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్ ఉత్తర ద్వారం సమీపంలో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజస్థాన్‌కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బ్లాక్ స్కార్పియో ఎస్‌యూవీ అదుపుతప్పి, నిర్మాణంలో ఉన్న ఒక వంతెనను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, నిర్మాణ స్థలంలోని పదునైన ఇనుప కడ్డీలు వాహనాన్ని చీల్చుకుంటూ లోపలికి పూర్తిగా చొచ్చుకుపోయాయి. ఈ దారుణ ఘటనలో రాజస్థాన్‌కు చెందిన కైలాష్ అనే పర్యాటకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. వాహనంలో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనం వంతెన స్తంభానికి వేలాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి మనాలి నుంచి లాహౌల్ వైపు వెళ్తున్న ఈ పర్యాటకుల బృందం రాత్రి సుమారు పది గంటల సమయంలో అటల్ టన్నెల్ దాటి బయటకు వచ్చింది. టన్నెల్ దాటిన కొద్దిసేపటికే వాహనం విపరీతమైన వేగంతో ఉండటం వల్ల డ్రైవర్ అక్కడ ఉన్న మలుపును సరిగ్గా గమనించలేకపోయాడు. దీంతో అదుపు తప్పిన స్కార్పియో చంద్ర నది వైపు దూసుకెళ్లి నిర్మాణంలో ఉన్న వంతెననై పడింది. ఇనుప రాడ్లు వాహనంలోకి గుచ్చుకోవడంతో ప్రయాణికులంతా అందులోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆదిత్య, రాజస్థాన్‌కు చెందిన రాజేంద్ర, డ్రైవర్ సిద్ధార్థ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన కైలాశ్ మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేగంగా వస్తున్న రైలు ముందు ట్రాక్ దాటిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
చిన్నారిని ఢీకొట్టిన ద్విచక్రవాహనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు..