డ్యాన్స్‌తో ఉర్రూతలూగించిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబలెంకా.. వీడియో వైరల్!
ABN , Publish Date - Jun 02 , 2026 | 04:37 PM
ఫ్రెంచ్ ఓపెన్ 2026 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో జపాన్ స్టార్ క్రీడాకారిణి నవోమి ఒసాకాపై ప్రపంచ నంబర్ వన్ అరీనా సబలెంకా ఘన విజయం సాధించింది. అనంతరం ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రెంచ్ ఓపెన్ 2026 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్ వన్ అరీనా సబలెంకా ఘన విజయం సాధించింది. మహిళల సింగిల్స్ లో హోరాహోరీగా సాగిన పోరులో జపాన్ స్టార్ క్రీడాకారిణి నవోమి ఒసాకాపై ఈ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక గెలుపు అనంతరం సబలెంకా ఫిలిప్ చాట్రియర్ కోర్టును ఒక్కసారిగా డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మైదానంలో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే ఈ బెలారసియన్ సుందరి, మ్యాచ్ ముగిసిన తర్వాత నృత్యంతో అదరగొట్టింది. అంతర్జాతీయ పాప్ ఐకాన్ మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో ఆమె చేసిన 'థ్రిల్లర్' డ్యాన్స్, 'మూన్‌వాక్' డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.
సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత కోర్టులోనే ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ప్రెజెంటర్ ఫాబ్రిస్ శాంటోరో మైదానంలోకి వచ్చి సబలెంకాను పలకరించారు. ఈ సందర్భంగా టెన్నిస్ కోర్టులో ఉన్న అభిమానుల కోసం లైవ్‌లో డ్యాన్స్ చేస్తారా? అని సబలెంకాను కోరారు. అందుకు ఒక ఆసక్తికరమైన షరతు పెట్టింది సబలెంకా. తాను డ్యాన్స్ చేయాలంటే గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులందరూ కూడా తనతో పాటు స్టెప్పులు వేయాలని కోరింది. ఇందుకు స్టేడియంలోని అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో ఆమె డ్యాన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వెంటనే ప్రెజెంటర్ శాంటోరో మైదానంలో మ్యూజిక్‌ని ప్లే చేయాల్సిందిగా కోరారు. మైఖేల్ జాక్సన్ క్లాసిక్ హిట్ 'థ్రిల్లర్' స్టెప్పులతో పాటు 'మూన్‌వాక్'ను సబలెంకా అద్భుతంగా చేసి చూపించింది. టెన్నిస్ కోర్టులో రాకెట్ పట్టి పరుగులు తీసే కాళ్లతోనే అద్భుతమైన డ్యాన్స్ చేయడం చూసి రోలాండ్ గారోస్ స్టేడియం ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది. అంతవరకు టెన్నిస్ మ్యాచ్‍ను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు, సబలెంకా పుణ్యమా అని ఒక చక్కటి లైవ్ డ్యాన్స్ షోను కూడా వీక్షించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
అనవసర బలవంతం తగదు.. వందేమాతరం పూర్తి గేయంపై శశిథరూర్
బీజేపీకి తమిళనాడు నేత అన్నామలై రాజీనామా